ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

కౌసల్య దేవి గుండె పగిలిన రోజు || Kowsalya Devi Gunde Pagilina Roju || Ramayanam || Epsode 54

 

 రాముడు కౌసల్యకు తన వనవాసం గూర్చి తెలుపడం


రాముడు దశరథునికి, కైకేయికి నమస్కరించి బయలుదేరగానే అంతఃపురంలోని స్త్రీలంతా ఘోల్లున ఏడ్చారు. రాముడు తండ్రి చెప్పినా చెప్పకపోయినా అందరికీ అన్ని పసులు చేసిపెడుతూ ఉండేవాడు. ఎవరి మీదా కోపగించుకొనేవాడు కాదు. ఒకవేళ ఎవరికైనా కోపం వస్తే వాళ్ళ కోపం మంచులా కరిగిపోయేట్లు మాటలు చెప్పేవాడు. అటువంటి రాముణ్ణి అడవులకు పంపుతున్నారు. మనమంతా దూడలు లేని అవుల్లాగా అయిపోతామే అంటూ ఏడవసాగారు. ఈ ఏడుపులన్నీ వింటూ దశరథుడు మళ్ళీ మూర్చపోయాడు. ఈ రోదన అంతా రాముడు కూడా విన్నాడు. కానీ మనోనిగ్రహంతో మదపుటేనుగులా మెల్లగా అడుగులు వేస్తూ ముందుకు సాగిపోయాడు.











కౌసల్యాదేవి అంతఃపురంలోకి ప్రవేశిస్తూనే అక్కడ చాలాకాలంగా ఉంటున్న వృద్ధుడైన ద్వారపాలకుణ్ణి, మరికొందరిని చూశాడు. వారంతా రాముణ్ణి 'జయీభవా అని, అభినందించారు. అట్లా ముందుకు పోతూనే రెండవ ప్రాకారం దాటాడు. అక్కడ వృద్ధులైన బ్రాహ్మణులున్నారు. రాముడు వారందరికీ నమస్కారం చేశాడు. అట్లా ముందుకుపోయి మూడవ ప్రాకారంలో ప్రవేశించాడు. అక్కడంతా స్త్రీలే ద్వారపాలకులుగా ఉన్నారు. వారంతా పరుగెత్తుకుపోయి కౌసల్యాదేవికి రాముని రాకను తెలియజేశారు.

కౌసల్యాదేవి ఎప్పుడూ చైతాలనాచరిస్తూ నియమనిష్టలు పాటిస్తూ ఉంటుంది. ఆ క్రిందటి రోజు రాత్రి అంతా జాగారం చేసి, ఉదయానే రాముని క్షేమాన్నికోరి తెల్లని పట్టుచీర ధరించి విష్ణుపూజ చేస్తోంది. సాక్షాత్తూ లక్ష్మీదేవిలా ప్రకాశిస్తున్న తల్లి పాదాలకు రాముడు నమస్కారం చేశాడు. ఆమె రాముణ్ణి లేవనెత్తి రెండు చేతులతో గట్టిగా కౌగలించుకొని శిరస్సుపై ముద్దుపెట్టుకొంది.

"ఓ రామా! నీ పూర్వీకులంతా పరమధార్మికులు. అంతా రాజర్షులే. మహాతులైన వారికి వలనే నువ్వు దీర్ఘాయుష్మంతుడవు కావాలి. గొప్ప కీర్తిమంతుడవు కావాలి. నీ కీర్తి ముల్లోకాలలోను వ్యాపించాలి. మన వంశ గౌరవాన్ని, వంశ ధర్మాన్ని ఎప్పటికీ కాపాడాలి.
నాయనా! నీకు రాజ్యాభిషేకానికి సమయం దగ్గరవుతూంది. ధర్మపరుడు, సత్యసంధుడు అయినా నీ తండ్రి దశరథ మహారాజు నీకు రాజ్యాభిషేకం చేయిస్తాడు. నువ్వు రాత్రంతా ఏమీ తినలేదు. ఉపవాసం ఉన్నావు. భోజనం చేసి వెళ్లు" అంది.

అప్పుడు రాముడు కౌసల్య దేవితో అమ్మా! ఇప్పుడు మనకు వచ్చిన ఆపద గూర్చి నీకు తెలియదు. నీకు ఎట్లా చెప్పటమా అని తటపటాయిస్తున్నాను. ఇంకా కొద్దిసేపట్లో నిన్ను, లక్ష్మణుని, సీతను విడిచి దండకారణ్యానికి పోవలసి ఉంది. ఇకపై మాంసాహారానికి బదులు తేనె, దుంపలు, పండ్లు తింటూ ఉండాలి. పద్నాలుగు సంవత్సరాలు అరణ్యంలో నివసించాలి. రాజ్యాభిషేకం భరతుడికి జరుగుతుంది. ఒక మునీశ్వరునిలా దండకారణ్యంలో నివసించమని నన్ను మహారాజు ఆజ్ఞాపించాడు అని అన్నాడు. 

రాముని మాటలు విన్న కౌసల్యాదేవి గొడ్డలితో నరికిన మద్దికొమ్మవలే నేలపై ఒరిగిపోయింది. స్వర్గం నుండి భూమిపై పడ్డట్లు పడిపోయింది. మొదలు నరికిన అరటిచెట్టులా నేలపై పడిపోయింది. రాముడు వెంటనే తల్లిని లేవదీసి పట్టుకొని కూర్చోబెట్టాడు. ఉపచారాలు చేశాడు.

అప్పుడు కౌసల్య రాముడితో నాయనా! రామా! గొడ్రాలికి ఒక్కటే దుఃఖం 'అయ్యో నాకు బిడ్డ లేకపోయాడే' అని, కానీ నీవు పుట్టడంవల్ల నాకు దుఃఖమే మిగిలింది సుమా! నాయనా! నేను మీ నాయనగారి వల్ల ఏ విధమైన సుఖసంతోషాలనూ పొందలేదు. అన్నీ నా కొడుకు హయాంలో రాజైన (తరువాత) రాజమాతగా పొందవచ్చునని సంతోషపడుతూ ఉండేదాన్ని. అవన్నీ కలలే అయిపోయాయి. నీటి మీద వ్రాసిన రాతలైపోయాయి.

నాయనా! ఆడరి భర్త కొట్టినా బాధపడదు గాని, తోటికోడలు నవ్వితే తల ఎత్తుకుని తిరుగలేదు. నా పని అట్లాగే అయింది. నేను ఇంతకాలం పట్టమహిషిగా ఉన్నాను. ఇకపై నా సవతులు చేసే ఎద్దేవా తలచుకొంటే తలకొట్టేసినట్లుంటుంది సుమా! వారి సూటిపోటి మాటలు వినలేను. వారు చేసే అవమానాలన్నీ పదాల్సిందే! ఇక నా దుఃఖానికి అంతే ఉండదు సుమా! ఓ రామా! నువ్వు ఇక్కడ ఉండగానే నన్ను ఈ విధంగా అవమానిస్తున్నారే! ఇక నువ్వు వనవాసానికి పోతే నన్ను వీళ్ళు బ్రతుకనివ్వరు. నాకు మరణం తప్ప వేరే గత్యంతరం లేదు.

నీ తండ్రి నా బ్రతుకును. కైకేయి దాసి కన్నా హీనంగా చేశాడు. నా స్వాతంత్య్రాన్ని పూర్తిగా హరించివేశాడు. ఇప్పుడు నాకు సేవచేస్తున్న సేవకులు కూడా. భరతునికి ఎక్కడ కోపం వస్తుందోనని భయపడి నన్ను పలకరించను కూడా పలుకరించరు. ఇక సేవల మాట చెప్పాలా? ఇకపై ఎవరూ నా ముఖం వంక కూడా చూడరు. నేను దిక్కుమాలిన దాననై పోతాను. కైకేయి ఇప్పుడు నన్ను చూస్తే నిప్పులు చెరుగుతూ ఉంటుంది. ఇక నువ్వు కూడా లేకపోతే ఆవిడతో నేనెట్లా వేగగలను?

రామా! ఎప్పటికైనా నాకు మంచి రోజులు వస్తాయని, నా దుఃఖాలన్నీ తొలగిపోతాయని నీ ఉపనయనం అయిన తర్వాత పదిహేడు సంవత్సరాల నుండి ఎదురుచూపులు చూస్తున్నాను. కానీ, రామా! నా అదృష్టం ఇట్లా తారుమారై ఈ వృద్ధాప్యంలో కూడా నా సవతులచే అవమానాలు ఈసడింపులు పదాలని నా ముఖాన రాసి ఉంది కాబోలు! ఈ ముసలితనంలో ఈ అవమానాలన్నీ ఎట్లా సహించగలను? చంద్రబింబం లాంటి నీ ముఖం చూడకుండా ఎట్లా ఉండగలను?

ఓ రామా! నీ కోసం ఎన్నో పూజలు చేశాను. ఎన్నో ఉపవాసాలు ఉన్నాను. ఎందరో దేవుళ్ళను పూజించాను. కాని ఒక్కళ్ళకూ నాపట్ల కనికరం లేకుండాపోయింది.

నా తపస్సు అంతా చవిటి నేలలో నాటిన విత్తనాల్లాగా వ్యర్థమైపోయింది. నిన్ను కన్నవాటి నుండి కళ్ళల్లో వత్తులు వేసుకొని జాగ్రత్తగా పెంచాను. నేను దరిద్రురాలను కావటంచేతనే నీకు ఈ కష్టం దాపురించిందేమో? రామా! ఏటిగట్లు కూడా వరదలొస్తే తెగిపోతూ ఉంటాయి కానీ, నా దుఃఖానికి  నా గుండెలు పగిలిపోవటంలేదు. బహుశా నా గుండె రాతితో చేశాడో. ఏమో! ప్రాణభయంతో ఒణికిపోతున్న లేడిని సింహం కనికరం లేకుండా నోట కరచుకుపోతుంది. కానీ, ఇన్ని అవమానాలు పడుతున్నా భయంతో ఒణికిపోతూ జీవితం సాగిస్తున్నా యముడు నన్ను తీసుకుపోవటంలేదు. యముడికి కూడా నాపై కనికరం లేకుండా పోయిందా? లేక యమలోకంలో నాకు చోటు లేకుండా పోయిందా? ఇన్ని దుఃఖాలు, అవమానాలు భరించి ఇంకా మరణం రాలేదంటే, అసలు నాకు మరణం లేదేమో! 

ఓ రామా! దూడ వెంటపోయే ఒక్క ఆవులా నేను కూడా నీ వెంట వస్తాను. చంద్రబింబం లాంటి నీ ముఖం చూసుకొంటూ బ్రతుకుతాను అని అంటుంది.

రాముడు తండ్రి ఆజ్ఞను జవదాటడని తెలిసినా లోపలనుండి ఉబికి వచ్చే దుఃఖాన్ని ఆపుకోలేక కౌసల్య, రాముణ్ణి పెనవేసుకొని ఏడ్చింది.
                                                                                  

 
            

                                                                                                                                    ←PREV || NEXT→

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు