శ్రీరాముడు దశరథ దర్శనానికి బయలుదేరటం
సుమంత్రుడు అంతఃపురంలోని ఏకాంతవాస ప్రాంతాన్ని చేరాడు. ఆ కక్ష్యలో జనసమ్మర్ధం ఎక్కువగాలేదు. సుశిక్షితులు, రామభక్తి పరాయణులైన రక్షకభటులు మాత్రమే ఉన్నారు. వారిని పర్యవేక్షిస్తూ కాషాయ వస్త్రాలు ధరించిన వృద్ధులున్నారు. వారితో సుమంత్రుడు "రామదర్శనానికి వచ్చా" నని చెప్పమన్నాడు. సుమంత్రుడు తండ్రికి సన్నిహితుడు, వృద్ధుడు, తనకు అత్యంత గౌరవపాత్రుడు కావటం వలన రాముడు సీతతో కలసి ఏకాంతగృహంలో ఉన్నా కూడా వెంటనే తన వద్దకు తీసుకురమ్మని ద్వారపాలకునికి చెప్పి పంపాడు.
రాముడు తెల్లటి దుప్పటికప్పిన బంగారుపాన్పుపై కూర్చున్నాడు. ఒంటినిండా శ్రేష్టమైన చందనాన్ని అలదుకున్నాడు. ఆ చందనం వరాహరక్తంలా సుగంధాన్ని వెదజల్లుతోంది. చక్కగా అలంకరించుకొని కుబేరునిలా కూర్చున్నాడు. ప్రక్కనే సీత నిలబడి వింజామరతో విసురుతూ ఉంది. రాముణ్ణి చూస్తూ ఉంటే చిత్రానక్షత్రంలో చంద్రునిలా ప్రకాశిస్తున్నాడు.
అటువంటి మహాతేజస్సుతో సూర్యునిలా వెలిగిపోతున్న రాముడికి సుమంత్రుడు వినయంగా నమస్కారం చేశాడు. సుమంత్రుడు ఆసనంపై కూర్చున్నాడు.
అప్పుడు సుమంత్రుడు రామునితో ఇలా అన్నాడు:కౌసల్యా పుత్రా! రామా! దశరథ మహారాజు, కైకేయి నిన్ను వెంటనే చూడాలని కోరుతున్నారు. నువ్వు వెంటనే అక్కడకు వెళ్ళవలసినది.
అప్పుడు రాముడు సీతతో ఇలా అన్నాడు: సీతా! నా తండ్రి, తల్లి కైకేయీ నన్ను చూడాలని అనుకొంటున్నారట. నా శ్రేయస్సుకోరి రాజ్యాభిషేకం గూర్చి వారేదో ఆలోచించి ఉంటారు. సమర్థురాలైన నా తల్లి కైకేయి నా తండ్రిగారి అభిప్రాయానికి తోడు తన ఆలోచన కూడా ఆయనకు తెలిపి, ఇప్పుడు నన్ను అక్కడకు తీసుకొని రమ్మని మంత్రి సుమంత్రుణ్ణి ఇక్కడకు పంపారు. నా తల్లి కైకేయి ఎల్లప్పుడూ నా శ్రేయస్సునే కోరుతూ ఉంటుంది. నా అభ్యుదయాన్నే కాంక్షిస్తూ ఉంటుంది. నా తండ్రి సంతోషాన్నే ఆవిడ ఎప్పుడూ ఆకాంక్షిస్తూ ఉంటుంది. ఇది నా భాగ్యమని తలుస్తాను. నేను వెళ్ళి నా తండ్రిగారిని, తల్లి కైకేయిని కలుసుకొని వస్తాను. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు.
అప్పుడు సీత ఇలా అన్నది : ప్రభూ! ఇప్పుడు మీ తండ్రిగారు యౌవరాజ్యాభిషేకం చేయబోతున్నారు. ముందు ముందు బ్రహ్మ దేవేంద్రునికి చేసినట్లుగా మహారాజ్యాభిషేకం కూడా చేయగలరు. అప్పుడు మీరు పరిశుద్ధులై రాజసూయాన్ని చేయతల పెట్టినప్పుడు మీరు కృష్ణాజినాన్ని ధరించి చేతితో లేడి కొమ్మును పట్టుకొని ఉండటం చూడాలని ముచ్చటపడుతున్నాను. మిమ్మల్ని తూర్పుదిక్కున ఇంద్రుడు, దక్షిణాన యముడు, పశ్చిమాన వరుణుదు, ఉత్తరాన కుబేరుదు రక్షిస్తారు గాక!
తరువాత రాముడు రాజ్యాభిషేకానికి తగినట్లుగా సర్వాలంకారాలు చేసుకొని సుమంత్రుని వెంట బయలుదేరాదు. బయటకురాగానే అక్కడే వేచి ఉన్న లక్ష్మణుని చూశాడు. అక్కడ నుండి మధ్యప్రాకారంలో తన కోసం వేచి ఉన్న వారందరినీ కలసి వారందరిని మర్యాదపూర్వకంగా పలకరించాడు. వారందరివద్ద సెలవు తీసుకొని తన కోసం నిరీక్షిస్తున్న రథంలో కూర్చున్నాడు. లక్ష్మణుడు కూడా రాముని వెనుకనే చమరాలతో రాముడికి విసురుతూ నిలబడ్డాడు. సుమంత్రుడే రథాన్ని స్వయంగా నడిపాదు.
సైనికులంతా సింహనాదాలు చేశారు. వందిమాగధులు మంగళాచరణాలు గానంచేశారు. జనులంతా కూడా రాముని స్తుతిస్తూ జయజయ ధ్వానాలు చేశారు. కవచాలు తొడుక్కుని, ఖడ్గాలు ధరించిన సైనికులు అప్రమత్తంగా రామునికి రక్షణగా రథాల మీద గుర్రాల మీద ఏనుగులపైన కాలినడకన అనుసరించారు.
కులస్త్రీలంతా వారి వారి ఇళ్ళల్లోనుండి, మేడల పైనుండి పూలవాన కురిపించారు. ఇంకొందరు ఎదురుగా వెళ్ళి మంగళహారతులు పట్టి "కౌసల్య కుమారుడా! ఓ రామా! నిన్ను కన్నతల్లి జన్మ ధన్యం, నిన్ను రాజుగా పొందటంతో మా జన్మ ధన్యమైంది. ఓ రామా! నీ భార్య సీత ఎన్ని పూజలు చేసిందో నిన్ను భర్తగా పొందింది. ఆమె జన్మ తరించింది" అని పలికారు.
స్త్రీలు, పురుషులు చిన్న, పెద్దలంతా పలుకుతున్న ఆ ప్రియ వచనాలన్నీ రాముడు వింటూ, చిరునవ్వులు చిందిస్తూ ముందుకు సాగిపోయాడు.
Comments