ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
రామునిపై అయోధ్య ప్రజల ప్రేమ!💓
రాముడు రథంలో అయోధ్యానగర వీరుల గుండా వివిధరకాలైన చందన, అగరు ధూపాలచే నిండిపోయిన సుగంధాలను దాటుకుంటూ పోయాడు. వివిధ దేశాలనుండి తనను చూడటానికి వచ్చిన జనసమూహాల్ని చూశాడు. వారంతా తనను, తన వంశాన్ని స్తుతించడం. విన్నాడు.
వీధులకు రెండు ప్రక్కలా ఉన్న రకరకాల అంగళ్ళను చూశాడు. అంగళ్ళలో రాసులుగా పోసిన పట్టువస్త్రాలను, నూలువస్త్రాలను చూశాడు. కొత్తముత్యాలను, పగడాలను చూశాడు. వాటికి ఇంకా బెజ్జాలైనా వేయలేదు. సరికొత్తవి. స్పటికాల్లాంటి రత్నరాసుల్ని చూశాడు. పరిమళ ద్రవ్యాలనమ్మే అంగళ్లను, తినుబండారలనమ్మే అంగళ్ళను, వాటిని విరివిగా కొంటున్న జనాన్ని చూశాడు. ఇంకొన్ని అంగళ్ళలో నిత్యపూజలకోసం పెరుగు, అక్షతలు, పేలాలు, చందనం, పూలు, పండ్లు మొదలైన వస్తువులను విక్రయిస్తున్నారు. వీధుల రెండు వైపులా ఆకాశాన్నంటే పెద్ద పెద్ద మేడల్ని చూశాడు. బ్రాహ్మణులు ఆశీర్వచనాలు పలుకుతూ ఉంటే రాముడు ముందుకు సాగిపోయాడు.
దేవేంద్రుని రాజవీథుల్లాగా ఉన్న అయోధ్యాపుర వీధుల్లో జానపదులు గుంపులు గుంపులుగా చేరారు. రామరాజ్యాన్ని గురించి గానం చేశారు. "దశరథ మహారాజు మన రాముణ్ణి యువరాజును చేస్తున్నాడు. అతడి పాలనలో మనం ఏ కొరతా లేకుండా జీవిస్తాం. మనందరికీ ఏ దిగులూ, కష్టమూ రాకుండా రాముడే మనల్ని ఆదుకుంటాడు. ఇకపై మనకు ఎట్లాంటి చీకూచింతా ఉండదు. ఇదంతా మన పూర్వజన్మల పుణ్యఫలం" అని గానం చేస్తున్నారు. వయోవృద్ధులు, ముఖ్యమైన పౌరులు, సహృదయులూ ఆ రధానికి దగ్గరగా వెళ్ళి, బిగ్గరగా "ఓ రామా! నీ రాజ్యపాలన నీ తాతముత్తాతల పరిపాలనను మరిపించేదిగా ఉండాలి.
మమ్మల్నందరినీ ఇదివరకటికన్నా ఎక్కువ సంతోషపెట్టాలి. ఇప్పుడు మాకు అన్నంతో పనిలేదు. నీళ్ళు అంతకన్నా వద్దు. నీ రాజ్యాభిషేకాన్ని కన్నులపండువుగా మేమంతా చూడాలి. మాకు నేత్రానందమే అన్నోదకాలు. నీ రాజ్యాభిషేకం కన్నులారా చూసి మా జన్మలు దన్యం. చేసుకోవాలని కలలు కంటున్నాం" అన్నారు.
రాముడు ఈ ప్రశంసలకు పొంగిపోలేదు. సమభావం ప్రదర్శించాడు. రాముడు రథం దూరమైనా, ప్రజల దృష్టి మాత్రం అతడి నుండి దూరం కాలేదు. అతని వైపే చూస్తూ ఉండిపోయారు. రాముని చూడని వారుగాని రామునిచే చూడబడని వారు గానీ అక్కడ లేరు. ఒకవేళ ఎవరైనా ఉంటే వారిని లోకులు నిందించటమేకాదు, తనను తనే నిందించుకుంటాడు. రాముడు చిన్న, పెద్దా తేడా లేకుండా నాలుగు వర్ణాల వారిని సమదృష్టితో చూశాడు. అందువల్ల అందరూ అతణ్ణి ప్రేమించారు. రాముడు చతుష్పథాలను, దేవాలయాలను, చైత్యాలను ప్రదక్షిణం చేస్తూ కైలాస శిఖరంలా తెల్లగా మెరిసిపోయే దశరథుని వర్ధమానమనే రాజప్రాసాదాన్ని చేరుకున్నాడు. మూడు ప్రాకారాలను దాటిన పిదప రాముడు రథం పైనుండి దిగి కాలినడకన బయలుదేరాడు. తన వెంట వచ్చినవారినందరినీ అక్కడే ఆగిపొమ్మన్నాడు. రాముడు ఒంటరిగానే అంతఃపురంలోనికి ప్రవేశించాడు.
Comments