కైకేయి తను కోరిన వరాలను గూర్చి రాముడితో చెప్పడం
రాముడు మందిరంలోనికి ఒంటరిగా ప్రవేశించాడు. అక్కడ ముఖాన కళాకాంతులు లేకుండా, వాడిపోయిన ముఖంతో పక్కపై పడుకొని ఉన్న దశరథుణ్ణి చూశాడు. వెంటనే ఆయన పాదాలకు సమస్కరించాడు. పిదప కైకేయి పాదాలకు సమస్కరించాడు. దశరథుడు 'రామా' అని మాత్రం అన్నాడు. ఆపై గొంతు పెగల్లేదు. కళ్లు నీటితో నిండిపోయి, బొటబొటా నీరు కారసాగింది. తండ్రిని ఇదివరకెప్పుడూ అంత దీనంగా చూడలేదు. తండ్రి పరిస్థితికి రాముడు కూడా కలత చెందాడు.
అప్పుడు రాముడు కైకేయితో అమ్మా! తండ్రిగారు సంతోషం లేనివారై కృశించిపోయి ఉన్నారు. గ్రహణం పట్టిన సూర్యునిలా, అబద్దమాడిన మహర్షిలా కాంతిహీనుడై ఉన్నాడు. తండ్రిగారు ఏదో ఊహించటానికి వీలుకానంత దుఃఖంలో ఉన్నారు. పూర్ణిమ నాటి సముద్రునిలా అమిత అశాంతితో ఉన్నారు.
అమ్మా! తండ్రిగారు నన్ను చూడటంతోనే సంతోషంగా పలకరించేవారు. అంతకుపూర్వం కోపంగా ఉన్న నన్ను చూడగానే కోపం అంతా పోయి ప్రశాంతంగా మారిపోయేవారు.
అమ్మా! అజ్ఞానంచేత నేను ఏమైనా తండ్రిగారి మనస్సు కష్టపెట్టానా? ఎప్పుడూ నేనంటే ప్రేమగా ఉండే వారు ఈనాడు ఒక్కమాటైనా నోటి వెంట రావడంలేదు. పైగా ముఖమంతా వాడిపోయి ఉంది. శరీరానికిగాని, మనస్సుకుగాని ఏదైనా తీవ్రంగా గాయం అయిందా?
అమ్మా! భరత శత్రుఘ్నులు క్షేమంగా ఉన్నారు గదా? నా తల్లులంతా క్షేమంగా ఉన్నారు గదా? నా తండ్రిగారికి నా వల్ల ఏదైనా కోపం కలిగితే, ఆయనను సంతోషపెట్టకుండా, ఆయన ఆజ్ఞలను పాలించకుండా ఒక్క క్షణంకూడా జీవించి ఉండను. తండ్రి అంటే మనిషికి ఇహ లోకంలో జన్మ నిచ్చినవాడు కదా! ఆయనను సంతోషపెట్టకుండా ఎట్లా ఉండగలను?
అమ్మా! నువ్వు గాని, తండ్రిగారికి కోపం తెప్పించే మాట ఏమైనా అన్నావా? ముందెన్నడూ నా తండ్రిని ఇటువంటి దీనస్థితిలో చూడలేదు. నీవైనా నాకు యథార్ధం చెప్పు.
అప్పుడు కైకేయి రాముడితో రామా నీ తండ్రికి ఎవరి మీదా కోపం లేదు. ఎటువంటి కష్టమూ కలుగలేదు. అయితే ఆయన నీతో ఒక మాట చెప్పటానికి భయపడుతున్నాడు. నువ్వు ఆయనకు ఎంతో ప్రియమైన వాడివి. అటువంటి ప్రేమపాత్రుడవైన నీతో అప్రియమైన ఒక మాట చెప్పటానికే తటపటాయిస్తున్నారు. ఆ మాట చెప్పటానికి ఆయనకు నోరు పెగలడం లేదు. అది నువ్వు తప్పక తెలుసుకోవాలి.
రామా! పూర్వం ఆయన నాకో వరం ఇచ్చారు. ఇప్పుడు ఆనాడు ఆ వరం నాకు ఎందుకు ఇచ్చానా? అని మథనపడుతున్నారు. అందువలన ఆయన మనస్సంతా పశ్చాత్తాపంతో నిండిపోయింది. నోట మాట రావడం లేదు. నదిలో నీరంతా పోయిన తర్వాత ఈయన ఆనకట్ట (సేతువు) కట్టాలని ప్రయత్నిస్తున్నారు.
రామా! సత్యమనేది అన్ని ధర్మాలకు మూలమని అందరికీ తెలిసిన విషయమే. నీ మీద ప్రేమచేత రాజు. ఈ రోజు ఆ సత్యాన్ని విడిచిపెట్టాలని చూస్తున్నాడు. నీ తండ్రి ఆసత్యవ్రతుడు కాకుండా ఉండేట్లు చూడటం కుమారుడిగా నీ బాధ్యత.
రామా! రాజు చెప్పదలచిన విషయం నీకు ప్రియమైనదైనా, అప్రియమైనదైనా నువ్వు ఆచరిస్తానంటే నేనే చెప్తాను. రాజు ఈ విషయాన్ని నీతో చెప్పలేకుండా ఉన్నాడు.
అప్పుడు రాముడు: అమ్మా! నీవిట్లా మాట్లాడవద్దు. తండ్రిగారు చెబితే నేను నిప్పులోనైనా దూకుతాను. ఆయన మహారాజు, నా తండ్రి. నా శ్రేయస్సు కోరేవాడు. ఆయన నన్ను విషం తినమన్నా సంతోషంగా తింటాను. సముద్రంలో దూకమన్నా దూకుతాను.
అమ్మా! తండ్రి చెప్పదలచినదేమో నువ్వే చెప్పు. నా తండ్రి చెప్పినట్లుగానే స్వీకరిస్తాను. ఆయన కోరినట్లుగా తప్పక చేస్తాను. ప్రతిజ్ఞ చేస్తున్నాను. రాముడు ఎన్నడూ రెండు మాటలు మాట్లాడడు అని కైకేయితో అంటాడు.
కైకేయి: రామా! పూర్వం దేవతలు రాక్షసులు యుద్ధం చేస్తున్నప్పుడు నీ తండ్రి దేవేంద్రుని పక్షాన పోరాడాడు. ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఆయన ప్రాణం రెండుసార్లు కాపాడాను. అప్పుదాయన సంతోషపూర్వకంగా నాకు రెండు వరాలిచ్చారు.
రామా! ఆ రెండు వరాలను నేనిప్పుడు ఈయమని అడిగాను. అవి ఏమిటంటే, ఒకటి భరతునికి రాజ్యాభిషేకం చేయడం, రెండు నువ్వు ఈ రోజే అరణ్యవాసానికి వెళ్లడం.
రామా! నీ తండ్రి సత్యవాదిగా ఉండాలంటే నువ్వు ఈ రెండింటికీ అంగీకారం తెలపాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం ఈ రోజునుండి పద్నాలుగు సంవత్సరాలపాటు నువ్వు అరణ్యాల్లో ఉండాలి. నీ కోసం ఏర్పాట్లు చేసిన యౌవరాజ్యాభిషేకాన్ని భరతునికి జరపాలి. అంటే నువ్వు రాజ్యాన్ని త్యాగం చేసి నారబట్టలు ధరించి పద్నాలుగు సంవత్సరాలు దండకారణ్యంలో నివసించాలి. భరతుడు రాజై అయోధ్యను పరిపాలిస్తాడు.
రామా! నీ పట్లగల ప్రేమ వలన నీతో ఈ మాటలు చెప్పలేక దుఃఖపడుతున్నారు. నీతో మాట్లాడలేకుండా ఉన్నారు. నిన్ను చూడలేకుండా ఉన్నారు. ఈ దుఃఖంతో ముఖమంతా వాడిపోయి ఉంది. రామా! ఈ విధంగా రాజు ఇచ్చిన వరాలను అమలుపరచి రాజుకు సత్యవ్రతుడన్న పేరును నిలబెట్టు.
Comments