నక్కతోక మహిమ
"ఎలుగుబంటి మాఁవా, నేను వచ్చింది నీ సాయం కోరడానికి, నీవన్నట్టు నీవు తొక్కిన నక్కతోక మహిమో ఏమో నాకు తెలియదు. ఈ క్షణం నుండి నీవు ఈ కాకుల దూరని కారడవికి కొన్నాళ్లు రాజువు. నేను నా సుపుత్రుని పెళ్లి పని మీద పొరుగు అడవికి వెళ్తున్నాను.”అని కిరీటం ఎలుగుబంటి నెత్తిపై పెట్టి వెళ్లిపోయింది....... ఎలుగుబంటి చిరకాల కోరిక తీరినందుకు అది చాలా ఆనందించింది. పొదలో నక్కిదాక్కున్న నక్క బయటికి వచ్చి “ఏటీ విడ్డూరం నా తోక తొక్కిన ఆ వెర్రి బాపడికి ధనం. రేపో మాపో కాటికి పోయే ఎలుగుబంటికి కిరీటం దక్కాయి. నాకేటి లేదా ?నా తోక పచ్చి పుండు కావడమేనా ? ఇంక ఎవరికి నా తోక దొరకనీయను." అని ఓ పెద్ద ఎలుకబొరియలోకి తోక పెట్టుకుని శోకాలు తీయసాగింది. పాపం నక్క దురదృష్టం ఆ బొరియలో ఆకలిగొన్న పందికొక్కు అందమైన నక్క తోకను మొదల్లో పుటుక్కున కొరికేసి ఆరగించేసింది. “చచ్చాను దేవుడోయ్ పాడు పందికొక్కు నా తోకను తినేసింది " అంటూ నేలపై గింగరాలు కొట్టి ఏడ్చింది.
అడవికి కొత్తరాజు ఎలుగుబంటి నవ్వి "చచ్చిన పీనుగులను తిని బతికే నీలాంటి వాడికి ఆ దేవుడు అదృష్టమైన తోక ఇచ్చాడు. పరోపకారం లేశమైనా లేని నీకు తగిన శాస్తి జరిగింది. నాకు ఈ అడవిలో మరి కనిపించకు. నా మాట ధిక్కరించావో నీ ప్రాణాలు తీయకుండా వదలను ఇది రాజాజ్ఞ" అని హెచ్చరించి పొమ్మంది ఎలుగుబంటి.
నక్క బిక్కచచ్చిపోయింది. వేదాంతిలా నవ్వుకుంది. " ఎలుగుబంటి మాఁవా, నాతోక దయ వలన రాజువయి తొలిసారిగా నాకే శిక్ష విధించావా, కలియుగం కదా, యుగధర్మం "అని తోకలేని నడుంతో భారంగా నడుచుకుంటూ వెళ్లిపోగా.. మరోవైపు ఎలుగుబంటి రాజదర్పంతో కాకులు దూరని కారడివిలోకి వెళ్లిపోయింది.
"బ్రతుకు జీవుడా అని నేను చెట్టు దిగి ఇంటి ముఖం పట్టాను. ఇది ప్రభూ! నాకు జరిగిన అడవి జంతువులతో వింతైన అనుభవం...." చెప్పి ముగించాడు.
చెవులురిక్కించి విన్న కవులు తెరలు తెరలుగా నవ్వారు. ఒకరిద్దరూ పడిపడినవ్వారు. రాయలు మాత్రం రామలింగడు ఏమనుకుంటాడోనని కనిపించకుండా నవ్వాడు. ఎలాగు మొదట బయటపడ్డ అయ్యలరాజు రామభద్రుడు మళ్లీ తానే గొంతెత్తి “రామలింగా, అడవి జంతువుల భాష ఏ గురువు నుంచి నేర్చుకున్నావు. మాకు చెప్పరాదూ నీ వద్ద నక్కల బాష క్షుణ్ణంగా అభ్యసిస్తాం. లేదా నీ గురువు వద్ద నేర్చుకుంటాం. ఆయనెవరో చెప్పు. "అని ప్రాధేయపడ్డాడు.
ఆ మాటలకు మరోసారి అందరూ గొల్లున నవ్వారు. ఈ సారి శ్రీకృష్ణ దేవరాయలు కూడా బిగ్గరగా నవ్వాడు. ఆ నవ్వుల ఆగిపోయ్యాక "అయ్యల రాజ రామభద్రా ! నక్కల భాష నిజంగా నేర్చుకుంటావా ? నీవేనా లేక ఇక్కడ కడివెడు నవ్వులుపాలు పంచుకున్న మనకవితిలకాలూ కూడానా ."అడిగాడు రామలింగడు.
కవులందరూ రామలింగడిని మరింత ఇరుకున పెట్టాలి అని ఏక కంఠంతో “నేర్చుకుంటాం" అన్నారు. రాయలూ అనేవాడేమో కానీ రామలింగడు ఇప్పటికే ఒంటరి అయిపోయాడు అని మౌనం వహించాడు.
"మిత్రులారా! నేను గురువుగా పనికి రాను. కారణం నన్ను గేలి చేస్తున్న శిష్యులు మీరు. నా వద్ద విద్య మీకు అబ్బదు. గురువు అంటే భయం, భక్తి, గౌరవం ఉండాలి. శిష్యులుగా శుంఠలు పనికిరారు. ఈ జంతువిద్య నేర్చుకోవాలన్న ఆశ మీకు బలంగా ఉంటే అదిగో మన ధర్మప్రభువులు రాయలు వారివద్ద చేతులు కట్టుకుని అభ్యసించండి. ఆయనకు ఎలుగుబంటి భాష వచ్చు కనుకనే జాంబవంతునిలో పరకాయప్రవేశం చేసి మరోవైపు ఎలుగుభాషను తెలుసుకున్నందున జాంబవతీకళ్యాణం రచించారు. కనుక ఆయన వద్ద నేర్చుకున్నాక, అప్పటికి ఓపిక, మరిన్ని జంతుభాషలు నేర్చుకునే కోరిక బలీయంగా ఉంటే మీలో ఇప్పుడున్న శుంఠతనం పోతే నా వద్ద నక్క సింహం భాషలు తప్పక నేర్పగలను" అని నిశ్శబ్దంగా మారిపోయిన ఆ మందిరంలో కంచుగంటలాంటి గొంతుతో వ్యంగ్యంగా ఏమాత్రం సంకోచించకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు రామలింగకవి.
ఒక్కసారి అందరి ముఖాలు వివర్ణమయ్యాయి. ఎవరికి వారే ఏమిటింత సాహసం రాయలవారినే తప్పుపట్టే ప్రయత్నం చేసేది, ఈ వెర్రిమొర్రి బాపడా ? కొంపదీసి ఈతడు అమావాశ్యకు పిచ్చిపట్టే రకం కాదుకదా! అని వరిపరివిధాలుగా ఆలోచించారు. భయంతో చూసారంతా. అప్పటికే అక్కడికి విచ్చేసిన తాతాచార్యులువారు నొచ్చుకుని "ఏయ్ రామలింగా నీకేమైనా మతిచాందసం ఉందా ? రాయలవారిని చిన్నబుచ్చుతావా? ఇక్కడ కొలువుతీరిన ప్రభువుకి, మిగిలిన కవులందరికి, క్షమాపణలు కోరుకుని తక్షణం ఈ నగరం విడిచిపో!" అని ఉగ్రుడైపోయాడు.
“మన్నించండి తాతాచార్యులుగారూ! నేనే అపరాధం చేయలేదే. ఎలుగుభాష తనకు వచ్చని మన ప్రభువులవారే సెలవిచ్చారు. అందుకు ఇక్కడ కవులందరూ చెక్కభజన చేసి మరింత ప్రోత్సహిస్తున్నారు. ఎంతటివారికైనా పొగడ్త ఎనలేని సంతోషాన్నిస్తుంది. మన ఏలిక ఆదిశలో ఆనందపడ్తున్నారు. నేను రాయలవారి శ్రేయస్సు కోరేవాడిని తప్ప ఇచ్చకాలవాడిని కాను. కనుకనే యదార్ధ వాదాన్ని వినిపించాను. యదారాజా! తదా ప్రజా !! కాకూడదు. అని కోరుకునేవాడిని." అని తను చెప్పాల్సింది చెప్పి లేచి నిలబడి "ప్రభూ నా మాటలు బాధించినట్లయితే నన్ను మన్నించండి." అని చేతులు జోడించాడు.
రాయలు తీక్షణంగా రామలింగనివైపు చూసాడు. అంతా ఇక రామ లింగడి పని అయిపోయినట్లే! కానీ దూర్జటి మాత్రం లోలోపల ఆనందించాడు. భలేగా రాయలకు గడ్డి పెట్టాడు. చక్రవర్తినన్న అహంతో తనకు ఎలుగు భాషవచ్చని పేలడం అందుకు తామంతా దిక్కులు పిక్కటిల్లేలా వంతపాడడం. బయటపడలేక తల అమ్ముకునే బతుకు అనుభవిస్తున్నాం. ధైర్యం అంటే రామలింగడిదేనని.......... కవులందరూ రాయలవైపే చూసారు. ఎలాంటి శిక్ష వేస్తాడోనని ఊపిరి బిగబట్టారు. బహుశా మరణదండన అని అనుకున్నారు.
రాయలు లేచి రామలింగని వద్దకు వెళ్లి "నీవు ధైర్యంగా నన్ను వేలెత్తిచూపావు. నిజమే ఈ రోజు నేను శృతిమించాను. ఆ కావ్యం రాసానన్న ఆనందంలో ఏమేమో అనేస్తూ నోరుజారాను. చక్రవర్తి తప్పును దిద్దే సాహసం ఎవరూ చేయసాహసించలేరు. అది నీవు అవలీలగా చేసావు. భయపడకుండా నీ వాదన వినిపించావు.. .జంతుభాషను నా వద్ద నేర్చుకోవాలా? గురుభక్తిలేనివారా వీరంతా ? పైగా శుంఠలా? ములుకుల్లాంటి నీచమత్కార పలుకులు నామనస్సున తొలుత కోపాన్ని పెంచినా తరువాత ఆనందాన్ని నింపాయి. " అని అభినందించాడు.
అంతా నిండుగా నవ్వుకున్నారు. అలసాని పెద్దన “రామలింగా, ఎక్కడ రాజాగ్రహానికి గురవుతావోనని భయపడ్డాను."అని గాఢంగా కౌగిలించుకున్నాడు.
క్షమించండి రామలింగకవి నేను తొలుత బాధ కలిగించేట్టు ఏమెమో అనేసాను." అయ్యలరాజు రామభద్రుడు చేతులుపట్టుకున్నాడు.
Comments