మనిషి బుద్ధిగల చిలుక
"ప్రభూ! రామలింగకవి వద్ద మాట్లాడే రామచిలుకకు తెలియని శాస్త్రమే లేదంటే అతిశయోక్తి కాదేమో ! ఆ పిట్ట ఆ కవికి ఎవరో మహనీయుడు ఇవ్వగా లభించిందట. అట్టి పక్షిని అతను కేవలం పండ్లు పెట్టి పెంచగలడు. అదే మనమందిరంలో ఉంటే ఎలా ఉంటుంది? బంగారు పంజరంలో తియ్యని పండ్లు, అడవి తేనె, సామాన్యులకు దొరకని అరుదైన కాయధాన్యాలు ఆ పక్షికి పెట్టి సాకగలం. దానికి మరింత మేథస్సు పెరగగలదు" అని పట్టపురాణి రాయలవారి దృష్టికి తీసుకువెళ్లింది. ఎలాగైనా ఆ రామచిలుకను తను పెంచాలనే కోరికతో ఓ రాత్రి తన మందిరంలో రాయలవారిని కోరింది.
"మహారాణీ ! ఆ కవి వద్దనున్న చిలుక ఎందుకు? అంతకంటే మరింత అందమైనవి తెప్పించి ఈ మందిరం నింపగలను. ఆ కవి ఒకరకంగా తిక్కమనిషి :ఏమాత్రం భయపడకుండా ఇవ్వనని మొండికేసిన మనమేమి చేయలేం" అని మహారాణికి నచ్చజెప్పచూసాడు రాయలు.
“మన్నించండి మహారాజా! ఆ చిలుక పలు శాస్త్రములను వల్లెవేసినది అని విన్నప్పటినుంచి దానిని పెంచవలెనని దానితో సరదాగా గడపాలని ఆశ పడ్తున్నాను. నా ఈ చిన్నికోరిక తీర్చండి" అని వేడుకుంది పట్టపురాణి. రాయలు ఆలోచించి చివరికి పట్టపురాణి చిరు కోరిక కాదనలేక సరేనని మరుసటి రోజు రామలింగకవిని స్వయంగా అడిగాడు. అందుకు రామ లింగడు అయిష్టంగానే ఒప్పుకున్నాడు.
క్షణాలలో పంజరంలో చిలుక పట్టపురాణి ఇంటికి చేరినది. "రామలింగా నీవు ఇంతత్వరగా ఒప్పుకుంటావనుకోలేదు. నీవు చాలా వింతైన మనస్సుగలవాడివి. ఏదిఏమైనా మా రాణి వారి కోరిక నీ సమ్మతితో తీర్చాను "అని రాయలు సంబరంగా చెప్పాడు.
"ప్రభూ ఆ చిలుక మనిషిబుద్ధిగల పక్షి. అది ఒక ముని ఇవ్వగా పుచ్చుకున్నాను. అది తర్కశాస్త్రములో దిట్ట. నా వద్ద చాలాకాలంగా ఉన్నా, దానికి రాజులనీడన బతకాలనే ఆశ ఎక్కువ. ఈ రోజు చాలా సంబరపడి పోయి ఉంటుంది. పోనీ, నా వద్ద ఏమి తింటుంది. పండ్లు నేతిమిఠాయిలు తప్ప, రాణివాసంలో ముద్దముచ్చటగా జీవించగలదు .ప్రతి రాత్రి దాని చిలుకపలుకలు వింటూ నిద్రపోయేవాడిని. తమరి మాట కాదనలేక ఇచ్చాను" అని దీనవదనంతో చెప్పి బయలుదేరాడు రామలింగడు.
రాయలకు ఆ చిలుకను తక్షణం చూడాలని ఆశ పుట్టి వెంటనే పట్టపురాణి మందిరానికి వెళ్లాడు. అక్కడ బంగారు పంజరంలో చిలుక ఉల్లాసంగా కనిపించింది. రాణి, ఆమె దాసీజనాలు చుట్టుముట్టి కేరింతలు కొట్ట సాగారు. రాయలను చూడగానే “రాజాధిరాజా! యవనరాజ్య స్థాపనా చార్యుడా, సాహితీసమరాంగణ చక్రవర్తి స్వాగతం! సుస్వాగతం!!" అని పంజరంలోంచి ఎలుగెత్తిపలికింది చిలుక. అంతా నోళ్లువెళ్లబెట్టి మరీ విన్నారు. రాయలు మతితప్పినవాడిలా పంజరంలోకి చూసాడు. నిశ్శబ్ధం అక్కడ చోటుచేసుకుంది. “ఓ శుకరాజమా! నీ చతుర సంభాషణ నాకు చాలా ఆనందింప చేసింది. ఎవరు నేర్పారు నీకీ మధురపలుకలు "అని పంజరంపై చిటికె వేసి మరీ అడిగాడు.
"విద్య ఒకరు నేర్పితే వచ్చేది. కానీ, నాకు ఎవరు నేర్పలేదు. గురువు లేని విద్య నాకబ్బినది. అదెట్లన్న చెట్టుతొర్రలో శిశువుగా ఉన్నప్పుడు ఒక బోయివాడు నాతల్లితండ్రులను వధించి నన్ను నాతోటి మరో ముగ్గురన్నదమ్ములను వాడిబుట్టలో వేసుకుని, ఇంటిముఖం పట్టాడు. బుట్టలో మా ప్రక్కనే జన్మనిచ్చిన నాతల్లితండ్రుల శవములను చూసి మా అన్నదమ్ములు కంటికి మింటికి ఏకధాటిగాఏడ్చాం. పసివాళ్లం ఎగురటకు రెక్కలు ఇంకారానందున. బిక్కుబిక్కుమంటూ ఉన్నాం. బోయివాడి గుడిశెలో వాడి పిల్లలు బుట్టలోంచి మమ్మల్ని తీసారు. పిట్టలన్నిటిని వండమని చెప్పాడు బోయివాడు. “మరీ పిల్లపచ్చులు కొన్నాళ్లు పోయాక వండుకుంటే బావుంటాది” అని అతడి పెళ్లాం చెప్పి మా తల్లితండ్రులను నిప్పులమీద కాల్చి ఆ తల్లీపిల్లలు ఇష్టంగా తినే దృశ్యం ఇంకా నా కళ్ళలో కదులాడుతోంది. ఆ రాత్రి ఆ బోయిగుడిశెలొ నన్ను తప్ప మిగిలిన నా సోదరులను ఓ పిల్లివచ్చి ఎత్తుకుపోయింది. ఒంట రిగా ఉన్న నన్ను ఆ బోయిపిల్లవాళ్లు ఆడుకునేందుకు అడవంతా తిప్పేవారు. వారూ దయాహీనులు. వారి రాక్షసక్రీడకు ప్రాణములు ఏ క్షణమైనా పోయేవి. ఆ అడవిలో దర్భలు ఏరుకుంటున్న ఓ ముని నన్ను చూసి "ఏయ్ పిల్లలూ ఆ చిన్ని చిలుక నిలుగుడ్లు వేయుచున్నది. కొంచెం నీరు పట్టినా బతకవచ్చు"అని జాలిపడ్డాడు.
"ఇది ఛస్తే కాల్చుకు తింటాం "అని బదులిచ్చి ఆ రాకాసి పిల్లకాయలు మరింత నన్ను హింసించారు. ఆ మునికి కోపం వచ్చి వారి నుంచి నన్ను లాక్కుని దయతో సాకాడు. అతడు రాచబిడ్డలకు విద్యలు నేర్పేవాడు. అవి విని నాకుగా నేను నేర్చుకున్నాను. ఆ గురుకులంలో చాలా కాలం ఉన్నాను. ఒకసారి ఆముని తనను చూడవచ్చిన రామలింగనికి నన్ను ఇచ్చి ఇది ఓ వింతైన చిలుక. శాస్త్రము తెల్సినది. నీకు పనికి వస్తుంది అని చెప్పాడు. అప్పట్నించి ఆ కవివద్ద నేటి వరకు ఉన్నాను" అని తన పాతజీవితం గురించి చెప్పింది.
ఆ కథ విని రాణి బొటబొట కన్నీరు కార్చింది. ఆమెను చూసి దాసి జనం కూడా కన్నీరుమున్నీరయ్యారు. రాయలు విచారవదనంతో ఆ శయన మందిరంలో తల్పంపై నడుం వాల్చాడు. దాసిలంతా వెళ్లిపోయారు. తన కాళ్లదగ్గర కూర్చున్న రాణీని చూసి "దేవీ పశుపక్ష్యాదుల్లో కూడా ఇలాంటి గాధలుంటాయా?”అని బాధపడ్డాడు. ఆ తరువాత మౌనంగా ఉండిపోయారు.
పంజరంలో చిలుక "నా గురించి మీరు బాధ పడకండి. ఆనందంగా ఈ రేయి గడపండి" అని మృధుమధురంగా పలికింది. ఇద్దరూ అయోమయంగా పంజరంవైపు చూసారు.
తెలతెలవారుతుండగా రాణి తల్పంపైనుంచి లేచి దుస్తులు సరి చేసుకుని పంజరం గుర్తుకువచ్చి అటుచూసింది. చిలుక నిశ్చలచిత్రంలా కనిపించింది. దగ్గరగా వెళ్లిచూసింది. “రేయి బాగా గడిచిందా? రాయలు వారు రశికులే !" అని నవ్వింది.
ఆమాటలకు రాణివారికి నిలువెత్తు సిగ్గు ఆవరించింది. మళ్లీ ఒక పక్షి మాటలకు తాను సిగ్గపడినందుకు నవ్వుకుని “ఏయ్ నువు భలే కొంటె చిలుకవు " అని అభినందించి తియ్యనిపండ్లు పెట్టింది.
“ఓ పట్టపురాణి, నీకు రాయలువారంటే ఎంతో ఇష్టం కదూ !” అడిగింది చిలుక.
“ఆయనంటే ఇష్టమే కాదు. నాప్రాణం చూసావా, నేను కోరగానే నిన్ను ఆ బాపని నుంచి తీసుకువచ్చారు. నేనన్న ఆయనకు అంతులేని ఇష్టం. నీకు నిజమేచెప్తున్నా, నేనంటే ఆయనకు ప్రాణం" అని ఎరుపెక్కిన బుగ్గలతో చెప్పింది".
మరీ గొప్పలు చెప్పకు. ఓ చిలుకను మీ వద్ద బతికీడ్చినవాడి వద్ద నుంచి తెచ్చిఇవ్వడం కూడా ఈడేర్చిన కోరిక ఎలా అవుతుంది ?
. "మగాడిని అనాదిగా ఆడది నమ్మిచెడిపోతోంది. అంతెందుకు రాయలవారికి నీవు మూడో పట్టపుభార్యవు. మీరే కాకుండా ఆయనకు మరి తొంబండుగురు భార్యలున్నారు. నీలాగునే ఆయనకు పన్నెండుమందీ ప్రాణప్రదములే. నీవు కోరినది చిలుక కనుక ఇవ్వగలిగాడు. భార్యలను త్యజించమంటే మగాడిగా అతడి బుద్ది బయటపడుతుంది” ఆచిలుక కిల కిలలాడుతూ చెప్పింది. ఆ మాటలను విని అంతులేని ఆశ్చర్యానికి గురయ్యింది పట్టపురాణి.
నిద్రమేల్కొని రాయలు లేచి వచ్చాడు. "ఏమిటి నాకంటే ముందు చిలుక పలుకలు వింటున్నావు. ” అని నవ్వుతూ అడిగాడు. రాణి ఒక్కక్షణం అక్కడ నిలువకుండా రాయలు వైపు చురచురా చూస్తూ వెళ్లిపోయింది. అర్ధంకాని రాయలు “ఓ చిలుక రాజమా, నా దేవి ఎందులకు ఏదో అలక బూనినట్లున్నది" అని చిలుకకు అర్ధం అవుతుందో లేదోనని ముద్దుగా అడిగాడు.
"నీ వంటి బహుభార్యలున్నవాడి పై ఏ భార్య అలకబూనదు ? చూసావా, రాజా! ఆమె కోరికపై నన్ను తెచ్చి ఇచ్చావు. క్షణికమే కదా-ఆమె ఆనందం. ఒక్క విషయం చెప్తాను. పులిపాలను తెచ్చి ఇచ్చినా, ధనరాసులు కుప్పలుపోసినా, నమ్మని ఆడుదాన్ని ఎవరూ నమ్మించలేరు. నిన్ను నీ భార్యలెవరూ నమ్మరు. స్త్రీ మనస్సు ప్రళయాంతకం కదా !"
ఆ చిలుక పలుకలు విన్నంతనే రాయలకు తలతిరిగిపోయింది. “ఏమీ ఈచిలుక యధార్థవాదం. ఎంత చక్కగా చెప్పినది. రాత్రంతా నాతో శయనించిన రాణివారు ప్రేమతో లేరన్నమాట. చిలుకన్నట్లు బహుభార్యలున్న వానికి ఏ భార్య నమ్మకంగా ఎటులుండగలదు? అని తనలో తాను తర్కించు కోసాగాడు.
"రాజా! నీతి శాస్త్రం చదివితివి కదా, ఎవరో పరపురుషునికి ఆనందాన్నిచ్చేదాన్ని కావాలంటే నీవు ఏ రీతిననో తెచ్చుకుని ఆ ఆనందం
అనుభవించవచ్చు. కానీ అట్టి పురషుని వద్ద నుంచి తెచ్చిన దాన్ని అంటే నన్నునీ కాంతకు కానుకను చేయడం ఎంతవరకు సబబు. పరపురుషుని వద్ద ఉన్న దేనినైనా మన హిందూ స్త్రీలు ఆశించి కోరవచ్చునా ! ఇది ఏధర్మం ?" అని చిలక రాయలవారిని అడగగానే రాయలు ముఖంలో నెత్తురుచుక్క మిగలలేదు. అదోలా అయిపోయాడు.
"ఓ చిలుకా నీ పలుకులు ధర్మబద్దమైన ఆణిముత్యాలు. చాలా పెద్ద తప్పు చేసాను.'ఎవరక్కడ ? ఈ బంగారు పంజరంలో గల చిలుకను మా మందిరంకు తక్షణం చేర్చండి" అని దాసీలకు ఆదేశించి వెనుదిరిగి వెళ్లిపోయాడు.
రాయలు పట్టపురాణివారి మందిరం నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయినందున ఒకరకమైన కలకలం మొదలయ్యింది. కొంతమంది దాసీలు "అమ్మా ఈ చిలుకను మహారాజు మందిరానికి పంపించేయమన్నారు. ఆయన ఎందుకో చాలా కోపంగా ఉన్నారు. మీరేమో స్నానానికి వెళ్ళారు. ఏం జరిగిందేమో" అని భయంతో విన్నవించారు.
రాణివారికి ఏమీ అర్ధంకాలేదు. పంజరంలో చిలుక మరింత ఉల్లాసంగా ఉంటూ “ఓ పట్టపురాణీ! రారమ్ము, చూసావా నీ విభుడు. నీవంటే పడిచచ్చునంటివి. ఏదీ అతని ప్రేమ ? వంతులవారిగా భార్యలతో ఉన్నవాడికి నీ ఒక్కదానిపై ఏ శాతం ప్రేమ ఉంటుంది. ఎంత గుడ్డిగా నమ్మి ఆరాధించుచుంటివి. నిన్ను చూస్తుంటే ఎనలేని జాలివేయుచున్నది."
"నీతో ఏమైనా అన్నారా? దాచకుండా చెప్పు" అని ప్రాధేయపడింది పట్టపురాణి. ఆమె కళ్లు పెద్దవయ్యాయి.
"ఓ పట్టపురాణీ ! నీవును ధర్మశాస్త్రములను చదివితివి కదా ! పరపురుషుని వినోదాన్ని నీవుకోరవచ్చా ? నేను రామలింగకవి వద్ద ఉన్నాను. ఇలా కాకుల్లాంటి నీ దాసీల కన్నుల్లో పడ్డాను. వారు అద్భుతమైన రామచిలుక ఉందనడం నీవు ఉచితానుచిత జ్ఞానంలేక ఏకంగా రాయల వారినే కోరడం బహుభార్యలోలుడైన ఆ రాజు ముందువెనుకలను ఆలోచించక ఆ చిలుకను నీకు తెచ్చి కానుకను చేసినందుకు ఇప్పుడిప్పుడు తను చేసింది తప్పని తెలుసుకుని కృద్ధుడైనాడు" అని రామచిలుక అర్ధమైయ్యేలా చెప్పింది.
పట్టపురాణి ఆ మాటలకు భయబ్రాంతయిపోయింది. “నేను తెలియక తప్పు చేసాను." అని బావురుమంది. దాసీలు ఆమెను ఓదార్చారు. అందులో ఒకదాసీ “అమ్మా ఈ దిక్కుమాలిన చిలుక వచ్చింది. అనర్దాలు దాపురించాయి. ఈ పాడు చిలుక మహారాజుగారికి ఏమేమో నూరిపోసింది. మేము దూరం నుంచి విన్నాం" అని చెప్పింది చిలుకను చూసి గుర్రెత్తిపోతూ......
"నిజమే ఇదంతా ఈ చిలుక ప్రభావమే. ఈ చిలుక నాపై చాడీలు చెప్పి ఉంటుంది. దీన్ని చంపి పాతరేయండి. ఇట్టి నీచపు పక్షులు బతకరాదు. నాకూ చెప్పింది మహారాజుపై, నేను నమ్మి ఆయనపై అలకబూని చెప్ప కుండా స్నానానికి వెళ్ళిపోయాను. వచ్చేలోగా ఈ ముదనష్టపు చిలుక నాపై ఏవేవో రాజుగారికి చెప్పి మనస్సు విరిచింది. అసలు ఇది ఎక్కడ పెరిగింది? తెనాలి రామలింగని వద్ద అతడికి పెంచిపోషించే రాజే లెక్క కాదు. మొన్నా మద్య భువనవిజయంలో అందరి సమక్షంలో మహారాజునే ఆడిపోసుకున్నాడట. అట్టి నోటి తీటగలవ్యక్తి పెంపకంలో ఈ నీచపక్షికి మనష్యుల రాగద్వేషాలు బాగా వంటపట్టాయి. రాజుగారి మనస్సు విరిగితే అంత త్వరగా అతకదు ...... ఏందారి ?" అని పట్టపు రాణి తలపట్టుకుని కూర్చుంది.
“అమ్మా దీన్ని వండుకుని తినేస్తామమ్మా మనల్ని ఇంతగా బాదపెట్టిన దీన్ని వదలరాదు.” ఒకదాసి ఎరుపెక్కిన కళ్లతో చిలుక పంజరంవైపు కసిగా చూస్తూ అడిగింది.
“మరి మహారాజుగారు అడిగితే ?" రాణీ భయం వ్యక్తం చేసింది. "మీరుభయపడకండి. పంజరం తెస్తుండగా తప్పించుకుపోయింది. అని చెప్తే సరిపోతుందమ్మా!”
“ఓసీ దాసీ, నన్ను చంపేశక్తి నీకుందే! నేను యధార్ధవాదిని. అందుకే లోకవిరోధిని అయ్యాను. నేను ధర్మశాస్త్రపారంగతుడను. నన్ను నిర్జించినా మీకు పుట్టగతులుండవు. స్త్రీబుద్ది ప్రళయాంతకం అని ఊరకనే పెద్దలు చెప్పలేదు. ఓ రాణీ నీ వెనుక కూటికి చేరిన దాసీ జనాల మాటలను పట్టించుకోవద్దు. ఇప్పటికైనా నీ పురుషుని ఆదేశాలను గౌరవించి నన్ను రాయల మందిరానికి చేర్చు. ధిక్కరించి మళ్ళీ తప్పు చేయకు.”
చిలుకమాటలు విని పట్టపురాణికి పట్టరాని కోపం వచ్చింది, “ధరిద్రపుచిలుకా! నీ గొంతు ఈ మందిరంలో నేను వినకూడదు. నా ఉసురు నిన్ను దహించివేస్తుంది.” అని ఇంకా ఏమేమో అంటుండగా “జయము జయము రాణీవారికి " అని వినయంగా నిలుచున్నాడు కొత్వాలు .ఒకపత్రం చదివాడు. అది విని అంతా ఆశ్చర్యపోయారు. ఈ క్షణం నుంచి పట్టపురాణి హోదానుంచి తొలగింపబడి కేవలం రాణిగా మాత్రమే మహారాజు గుర్తిస్తున్నట్టు ఆ పత్రంలోసారాంశం. అంతవరకు 120 మంది దాసీజనాలతో కళకళలాడిన ఆ భవనంలో కేవలం 21మంది దాసీలు మాత్రమే మిగిలారు. రాజుగారి ఆదేశాలు క్షణాల్లో అమలులోకి వచ్చేసాయి. శోకమూర్తి అయ్యింది రాణి. ఆమె చుట్టు మిగిలిన దాసీలు కూర్చుని ఆమెను ఊరడించసాగారు.
“మన్నించండమ్మా మాకు రాణీవాస ప్రవేశం నిషిద్దం. కానీ, ఉన్న పళంగా మహారాజుగారే ఆదేశాలు అమలు చేయమన్నారు. చివరగా తమ వద్ద ఉన్న బంగారుపంజరంలో గల చిలుకను అత్యంత జాగ్రత్తగా తీసుకు రమ్మన్నారు. తీసుకుపోదునా తల్లీ! " అని కొత్వాలు చేతులు కట్టుకుని అడిగాడు.
"ఓయీ! ఇదిగో ఇక్కడ ఉన్నాను. నీవు ఏ కొంత ఆలస్యంగా వచ్చినా నా ప్రాణములు నిలుచునవి కావు. ఇక్కడ దాసీ జనాలు స్త్రీమూర్తులుగారు. కసాయిలకు ప్రతిరూపాలు. చిన్ని చిలుకను నన్ను చంపి తినేవరకు వెళ్లారు. ఎటులనో ఆ మాట ఈ మాటచెప్పి ఇంత వరకు నాబతుకుబతికితిని." అని చెప్పింది చిలుక. కొత్వాలు అంతులేని ఆశ్చర్యంతో పంజరం వైపు చూడసాగాడు. అలా మాట్లాడే చిలుకను చూడటం ఇదే మొదటిసారి.
“అమ్మా ఈ జుహీరున్నీసా వలన మీకు ఇన్నికష్టాలువచ్చాయి. ఖతర్ నక్ చిలుక గురించి చెప్పాను. పాపం ముచ్చటపడి తెప్పించుకున్నారు. ఇది పాగల్ పంచీ (పిచ్చి చిలుక) మొత్తం మహల్ గలీజ్ (మురికి) చేసింది, రాజావారితో మీకు లడాయి పెట్టింది. రాజావార్కి మై సచ్ బోల్తా హూ! ముజ్కో ఆజ్ఞా దీజియే "అని కళ్ల నీళ్లు తిప్పుకుని మరీ అడిగింది ఒక దాసీ.
"ఏ సాయిబుల బచ్చీ, నీవు వచ్చీరానీ తెలుగు ఉర్దూ కూతలు కల గలిపి రాయలవారికి చెప్తే ఈ రాణమ్మకు మంచికి బదులు బహుత్ బురా (పెద్దచెడ్డ) చేస్తావు. అసలే తోకతొక్కిన పాములా ఉన్న రాయలు వారు మీ సాయిబుల పద్దతిలో మనరాణమ్మకు 'తలాక్ తలాక్ తలాక్ 'అని మూడు సార్లు చెప్పేయగలరు. అప్పుడు ఈచిన్ని రాణీవాసం ఉండదు. ఏ ఊరవతల విడిదికే పరిమితం అవుతారు." అని పంజరంలోంచి పెద్దగొంతుతో చెప్పింది చిలుక.
జుహీరున్నీసా కోపంతో పండ్లు పటపటకొరికి " చుప్ బద్మాష్, మార్ లుంగా” అని చిలుకపై కస్సుమని అరిచి ఇటుతిరిగి "అమ్మా ఈ పిచ్చిచిలుక తలాక్ అని కూసింది. అంటే ఏమిటో మీకు తెలుసా? తలాక్ అని మూడుసార్లు చెప్తే శాశ్వతంగా విడిపోవడం మా ముస్లింలలో ఉంది. ఈ చుప్పనాతి చిలుకకు మా మతం మీద కూడా పట్టుంది. దీని మాటలు వింటే గుస్సాగా ఉంది.” అని కళ్లు తుడుచుకుంది.
ఆపక్కనే ఉన్న కటకానికి (ఒరిస్సా) చెందిన ఓ దాసి చిలుకను చీదరించుకుంటూ "కదొకు జిబొ కాహిఁకి? గొడొ ధొయిబొ కాహిఁకి .” అని చెప్పి బాదపడింది.
“ఏమంటున్నావు ? నాకు ఒక్క ముక్క అర్ధంకాలేదు.”జుహిరున్నీసా అడిగింది ఆ ఓడ్రపు దాసీ అమ్మాయి ఒరియా మాటలకు.
పంజరంలో రామచిలుక రెక్కలు టపటపలాడిస్తూ “నన్ను అడుగు నేను చెప్తాను. ఆ దాసి కటకానికి చెందినది. అంటే ఓడ్రపుభాష అమ్మాయి. ఏంకూసిందీ అంటే అడుసు తొక్కనేల కాలుకడుగనేల అని అర్ధం. ఆ దాసి వచ్చింది ఓడ్రపుదేశం కటకం (కటక్) నుంచి, పట్టపురాణి అన్నపూర్ణాదేవికి పుట్టింటివారిచ్చిన దాసీజనాలలో ఈమె ఒకతే. ఆ పట్టపురాణి వారితో ఏం సరిపడలేదో ఏమో కానీ ఈ రాణీవాసానికి వచ్చింది. "అని చిలుక ఆఓడ్రపు దేశపు దాసి గురించి మొత్తం వివరించింది.
అంతా హడలెత్తిపోయారు. "ఓర్నాయినో ఇది తగువులమారి చిలుకే కాదు .దీనికి తెలియని బాష లేదు. ఈ విజయనగర సామ్రాజ్యంలో తెలియనిది లేనట్లుంది. దీని నోట్లో నోరు పెడితే, ఇది మన నోట్లో ఇంత గడ్డి పెడుతోంది. కొత్వాలయ్యా దీన్ని తీసుకుపో ! "అని ఓ తెలుగుదాసి చెప్పి పంజరం చేతికి అందించింది.
"ఏమేవ్ తెలుగుపిల్లా ! నువ్వు కార్యవాదివి. నన్ను ఎలా వదిలించుకున్నావో ! ఈపాటి బుద్ధి ఆసాయిబులపిల్లకు, ఒరియాపిల్లకు బొత్తిగా లేదు. మీ రాణమ్మకు చెప్పు ఇలాచిలకలు, ఎలకలతో ఆడుకుంటే కాదే! చక్కగా రాయలవారికి ఓ వారసుడిని కనిఇమ్మనే. పాపం రాయలవారికి భార్యలధికం కానీ, ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు సంతానంతో కళకళలాడడం లేదు. ” అని చివరిగా ఆ మాటలంది ఆ గయ్యాల చిలుక.
"అమ్మా చూసారా ఆ రాలుగాయిచిలుక ఎంతలేసి మాటలాడు తోందో !" మరోదాసి రాణివారితో బాదపడూ చెప్పింది.
“అదో చుప్పనాతి పక్షి దానివిషయం వదిలేయండి. రాయలవారికి నేనంటే ఎంతిష్టమో మీఅందరికి తెలుసుకదా, ఆయన ఎందుకు ఇలామారిపోయారు. నేను ఏ తప్పు చేసాను.” అని చుట్టూ కూర్చున్న దాసిలను అడిగింది రాణి ఏడుస్తూ.
"అమ్మా మగాడిని నమ్మరాదమ్మా! అందులో రాజులను అసలు నమ్మకూడదు.” ఓదాసి చెప్పింది. కళ తప్పిన రాణీవాసం అయ్యింది.
రాయలవారి ముంగిట పంజరం పెట్టి చేతులు కట్టుకున్నాడు కొత్వాలు. రాయలు చూపులు చిలుకపై నిలిచాయి, “ఓచిలుకా నువ్వు రామలింగకవి వద్ద శుశ్రూష చేసినదానవు. అతనివలే నీకు వేపకాయంతా వెర్రి ఉందికదూ ! ఏ మాత్రం భయమన్నది లేకుండా ఏకంగా నాపట్టపు రాణిపై అభాండాలు వేసావు. అక్కడ మహరాజుగా ధర్మసంరక్షకుడిగా ఆమెపై చర్య తీసుకున్నాను. ఆమెపై ఎంతటి తీవ్ర ఆరోపణలు చేసావు. ఆమె పరపురుషుని గురించి అలోచించినట్లు చెప్పి రుజువుచేసావు. నీవు చిలుకవు అయిపోయావు లేకుంటే మనిషివయి పుట్టి ఉంటే ఎంత ప్రమాదం”
“మన్నించండి. నేను యధార్థవాదిని. నేను చెప్పినదానిలో నిజం లేకపోయినా, నిజమే అనేట్టు భ్రమ ఉంది. అదే ఆమె పాలిటి శాప అయ్యింది. వాస్తవానికి ఆమె పరపురుషుని గురించి ఆలోచించలేదు. అమాయకంగా మాటలాడే చిలుకను కోరుకుంది, ఇక్కడే ఆమె తెలియకుండా పొరపాటుచేసింది. ఏలినవారు నన్ను మన్నించి ఆమెను క్షమించి ఆమెకు మీ మనస్సులో పూర్వవైభవం కల్పించ ప్రార్దిస్తున్నాను.”
కొత్వాలు పరిసరాలను మరిచి చిలుక మాటలను వింటున్నాడు.
“ఓ చిలుక నేను నాపట్టపురాణిని క్షమించినచో నా నీతి, నా ధర్మం తప్పుపట్టవు కదా !"
“చెప్పాను రాజా ! చేయని నేరం ఆమెది. కనిపించే నేరాన్ని శిక్షించే రాచరికం తమది . శిక్ష విధింపుతో ధర్మబద్ధుడు అనిపించుకున్నారు. ఇప్పటికే ఆమె శోకమూర్తి అయ్యింది. ఆమెను కరుణించండి.”
రాయలవారికి ఇంతవరకు చిలుకపై ఉన్న కోపం ఇప్పుడు చెప్పిన ధర్మమైన మాటలకు చాలా వరకు తగ్గిపోయింది. సరిగ్గా అప్పుడే విచ్చేసాడు మహామంత్రి తిమ్మరుసు " నాయనా ఏదో చిలుకను తెచ్చావట. అది రాణీ వాసాన్ని అల్లకల్లోలం చేస్తోందట. అలాంటి దుష్టపక్షులను మనం భరించ లేం దాన్ని పీడవదిలించుకోవడమే ఉత్తమలక్షణం.”చెప్పాడు.
కొత్వాలు గుటకలు మ్రింగుతూ చూడసాగాడు. రాయలువారు చిన్నగా నవ్వి “అప్పాజీ ! అదిగో ఆరామచిలుక "అని చూపాడు. తిమ్మరుసు ఆశ్చర్యంగా చూసాడు దానివైపు.
"సుస్వాగతం మహామంత్రివర్యులకు, తమను దర్శించినందుకు నా జన్మధన్యం అయ్యింది. నన్ను దుష్టపక్షిగా సెలవిచ్చారు. ఆ మాటలకు ఏబాధా లేదు. కానీ, తమనోట అటువంటిమాటలు రావచ్చా! నాడు అవసానంలో ఉన్న వీరనరసింహరాయలవారు కొలువులో మంత్రిగా వెలగబెట్టిన మిమ్మల్ని ఆతడు కోరినది ఏమిటి ? మీరు చేసినది ఏమిటి? పాపమాతడు మిమ్మల్ని నమ్మి తన కొడుకుకి పట్టం కట్టమని తన సవతి తమ్ముడైన మన ఏలిక రాయలువారిని చంపి ఆనవాలుగా కండ్లు తీసుకురమ్మని కోరితే, దాచి మేక కనుగుడ్లు తెచ్చి చూపి పాపమా వీరనర సింహరాయల వారి ప్రశాంతమైన చావుకు కారకులైయ్యారు. ఓ మంత్రి పదవిలో ఉండేమీకు ఇన్ని రాజకీయపుటెత్తులు అవసరమా ? మీ చాతుర్యం ఎంతటిదో చరిత్రలో కొన్ని పుటలు చెప్పకనే చెప్తాయి. మీకు పూర్ణ ఆయుష్షు ఉండి మళ్లీ రాయలవారి వారసత్వం విషయంలో మీ పాత్ర ఏవిధంగా మలుపులు తిరుగుతుందో?" చిలుకని పలుకులు వింటూ రాయలు, తిమ్మరుసు, కొత్వాలు అవాక్కయ్యారు.
తిమ్మరుసుకు ముఖంలో నెత్తురుచుక్క లేకుండా అయిపోయింది. రాయలు భృకుటి ముడిపడింది. అతని మనస్సు అంతా ఆలోచనలతో ముసురుపట్టినట్టుయ్యింది. పక్కనే ఉన్న తిమ్మరుసు వైపు చూడలేక చూసాడు. తిమ్మరుసు అంతటి వృద్ధాప్యంలో కూడా చిలుకపలుకలను విని తట్టుకోలేక మొలలో ఉన్న కరవాలం పై చేయిబిగించాడు. ఆ తరువాత తమాయించుకున్నాడు. గట్టిగా కన్నులు కొన్ని క్షణాలు మూసుకుని భారంగా తెరిచాడు.
నిశ్శబ్దం ఆమందిరంలో కొన్ని క్షణాలు రాజ్యమేలింది.
మనిషిబుద్దిగల ఈపక్షి రాజమందిరంలో ఉండడం చాలా ప్రమాదం . ఇది శత్రువులా తేనెపూసినమాటలను ఎలాంటి జంకులేకుండా, ప్రాణభీతి లేకుండా ప్రేలుతోంది. అవశ్యం దీన్ని వదిలించుకోవాలి.” అని తిమ్మరుసు చిరుకోపం ప్రదర్శించాడు.
రాయలు ఏమీ బదులీయకుండా చిలుకవైపు చూస్తూ నిలబడ్డాడు. "కొత్వాలు ఇది పక్షి అయిపోయింది కనుక బతికిపోయింది. దీన్ని పెంచి పోషించినవాడు ఆ తెనాలి రామలింగడు కదా ! ఆ మద్య ప్రభువులనే భువనవిజయంలోకి అతడు తొలిసారి అడుగుపెట్టినరోజే అవమానించాడని విని తల్లడిల్లిపోయాను. కవులు, పండితులు, కిందిఉద్యోగులు, సామంతులు, పాళెగాళ్లు, ఇలాంటి కఠోరపలుకలను పలికే నీచపక్షులను వారిస్థాయిని మించి ఎదగనీయరాదు. ఆరోజే తెనాలి రామలింగడుని శిక్షించి ఉంటే ఈపక్షి ఇలాంటి కూతలు కూసిఉండేది కాదుకదా ! " అని తనలో ఏదీ దాచుకోకుండా చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయాడు తిమ్మరుసు.
"ఓ చిలుకా నువ్వు తిరిగి తెనాలిరామలింగని ఇంటికి వెళ్లిపోతావా?" రాయలు దానివంక విచిత్రంగా చూస్తూ అడిగాడు.
“ఏం మహారాజా ! తిమ్మరుసువారు నన్ను వదిలించుకోమన్నారని, ఆయన మాటలకు విలువనిచ్చి సాగనంపుతున్నారా ? మీరు పంపినా నేను వెళ్లను. ఆకవీశ్వరుని వద్ద శుశ్రూషతో నా జన్మ ధన్యం అయ్యింది. ఆయన మాట పెళుసు, ముక్కుసూటితనం నాకు వచ్చాయి. తప్పుడు మాటలు ఆడనంతవరకు మనకేమీ కాదు. లేనిపోనివి అభాండాలు చెప్తే మన విలువలు నశిస్తాయి, ఎదుటివారిని బాధించేవారవుతాం శారీరక హింసకు గురవుతాం అదే నాకు తెలిసింది." అని అందంగా చెప్పింది.
"నీవంటి పక్షి మాటలను నిత్యం వినాలని ఆనందించాలని ఉంది. కానీ, నీ కుండబద్దలు కొట్టిన విధం ఒకింత అయోమయంలోకి నెట్టేస్తోంది” అని చిలుకకు చెప్పి కొత్వాలతో నీవు ఇక్కడ ఉన్నట్టుగా వెళ్లి రామలింగని తీసుకురావాలి. ఆయన ఎంతటి పనిలో ఉన్న ఇది రాయలవారి అత్యవసర పిలుపుగా చెప్పి తీసుకురా !”చెప్పి పంపాడు.
చిలుక, రాయల మధ్య మౌనం చాలాసేపు సాగింది. తిమ్మరుసు గురించి చిలుక చెప్పిన విషయాలను రాయలు పదేపదే ఆలోచిస్తూ మందిరంలో పచార్లు చేయసాగాడు. కొంతసేపటికి కొత్వాలు వెంట రామలింగకవి విచ్చేసాడు. చేతులు కట్టుకుని నిలబడి "ప్రభూ ! పిలిచారట.” దారిలో కొత్వాలు చెప్పాడు. చిలుక తమను బాధ పెట్టిందట. దానికి జన్మయితే పక్షిగా ఆ బ్రహ్మ సృష్టించాడు. కానీ అది మనిషిగా పుట్టాల్సిందే.
నన్ను అనేక శాస్త్రములపై ప్రశ్నించి మరీ చంపుతుంది. అది లేకుండా హాయిగా రాత్రంతా గడిపాను. తమ ఆగ్రహానికి గురయిందని విన్నాను మన్నించి దాన్ని వదిలేయండి” అని ప్రాధేయపడ్డాడు.
"రామలింగా ఇది పక్షిజాతికే తలమానికం. దీనిని శిక్షించలేను. దీని కారణంగా నేను నా రాచరికపు పనులపై దృష్టి మరల్చలేకున్నాను. తిరిగి తీసుకుపో ! ఈ చిలుకతో నా విలువైన సమయం గడిచిపోతోంది.”
“మన్నించండి. నేను తిరిగి తీసుకుపోజాలను. ఇది రాణీవాసంలో ఒకరాత్రి ఉంది. ఇప్పుడు మీమందిరంలో ఉంది. ఇక్కడ వైభవాలను అనుభవించిన దీన్ని నేనెట్లు సాకగలను. నావలన కాదు. నేను తమ దయాలబ్దంతో బతుకు ఈడ్చుచుంటిని " అని రామలింగడు చేతులెత్తేసాడు.
ఎంత ఖర్చయినా తాను భరించగలనని రాయలు రామలింగనికి నచ్చజెప్పచూసాడు. పంజరంలో చిలుకకు చిర్రెత్తిపోయింది. అది అసలే వాగుడుకాయ. పెద్దగా రెక్కలు ఆడించి పంజరంలో విచిత్రశబ్దాలు చేసింది.
“ఓ సాహితీసమరాంగణ చక్రవర్తీ! పాపమా కవితిలకాన్నేందుకు బతిమాలి బామాలడము, ఈమందిరంలో పెదవివిప్పకుండా నాబతుకు నేను బతకగలను . నేను ఎవరికి అక్కర్లేదనుకుంటే నన్ను వదిలేయండి. ఈ విశాల ప్రపంచంలో నాకు చోటుదొరకకపోదు ” అని చిలుక గొంతువిప్పింది.
"రామలింగా నీవు కాదంటే విడిచిపెట్టడమే .ఈ చిలుక నీలాగే జంకుగొంకు లేనిది. ఎవరూ భరించలేరు. చూసావా, దాని గర్వం. " "విడిచిపెట్టేయండి ప్రభూ! అదే దాని బతుకు బతుకుతుంది. నాకెలాంటి అభ్యంతరం లేదు" అని తన అభిప్రాయాన్ని చెప్పాడు రామలింగడు. కొత్వాలు ఆ పంజరంలో చిలుకను విడిచిపెట్టు" అని రాయలు ఆజ్ఞాపించాడు.
" ఓ చక్రవర్తీ! నన్ను విడిచిపెడుతున్నది ధర్మప్రభువు శ్రీకృష్ణదేవ రాయలువారు. స్వతంత్రజీవనానికి రిక్తహస్తాలతో పంపరాదు అని మీకు ఏ ధర్మశాస్త్రం గుర్తు చేయలేదా ? నా కనీస కోర్కెలను తీర్చరా ప్రభూ!" అని చిలుక ఆశగా ముద్దుముద్దుగా అడిగింది.
"కోరికలా? కోరుకో ! నీఇష్టం ఎన్నయినా నాకు అభ్యంతరం లేదు."
“ మహాధాత! నేను మానవుణ్ని కాను. ఆశకు అంతులేని జాతి అంతకన్నకాదు. ఒక కోరిక నా కోసం! మరొకటి మీ కోసం..... అడగగలను." అడిగింది చిలుక. పంజరంలో దర్పంగా నిలుచుంది.
"మా కోసం ఏమడుగుతావు ? "రాయలు తీక్షణంగా చూస్తూ అడిగాడు. ఆ చిలుక మాటలు అంతులేని ఆశ్చర్యకరంగా ఉన్నాయి.
"ప్రభూ ! నా కారణంగా మీ ఆలుమగల మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ఆమెను మీరు తిరిగిస్వీకరించాలి. ఇది నా మొదటి కోరిక. ఇక నా రెండోకోరిక . ఈనగరానికి పశ్చిమంలో ఉండే అడవిలో తిరు గాడే బోయవాళ్లను నా ముందునిలపాలి. అప్పుడు నేను ఏంకోరినా కాదన కుండా నాకోరిక తీర్చాలి. నన్ను సంతోషింపచేయాలి. మాట తప్పని మహీపాలకులు."
రాయలు ఆ ఏర్పాటు చేసాడు. మరుసటిరోజు అడవిలో తిరుగాడే బోయలందరిని వరుసగా నిలబెట్టారు. పంజరంలో చిలుక పిచ్చిపట్టినట్లు తిరుగాడింది. కన్నులు ఇంతింత చేసుకుని మరీ ఆ బోయవారి వైపు చూసింది. అక్కడ వారంతా అయోమయంలో చోద్యం చూడసాగారు. చిలుక ఒక బోయవానిని గుర్తించింది. గుర్రెత్తిపోయింది “చిక్కితివిరా నరాధమా! ఇక నీకు బతికే దారి లేకుండా చేస్తాను.
చేత విల్లంబులను పట్టుకుని పిడెకెడు మాంసపు ముద్దగా లేని మావంటి అల్ప శాఖహార పక్షులను వధించినందుకు తగిన శిక్ష నీకై కాచుకుని ఉంది. అదే మరణదండన. ” కసిగా తర్కించుకుంది.
"ప్రభూ ! వాడే ఆబోయవాడు. నాతల్లితండ్రులను చంపిన కిరాత కుడు. వాడికోసమే నేను మనిషిలా మారిపోయాను. శాస్త్రపాండిత్యం సంపాదించాను. ప్రాణాలు పణంగా పెట్టి మీ అందరి మధ్య నా ఆధిక్యతను చాటాను. ఈ రోజు ఏలిక మనస్సులో నాకో గుర్తింపు లభించింది. కనుకనే ఈ కిరాతకునిపై నా కక్ష సాధించేవీలు కలిగింది. ఇక నా కోరిక చెప్తున్నాను. మాటిచ్చారు కనుక తీర్చాల్సిన బాధ్యతమీకుంది. నా కనుల ముందు ఈ బోయ వాణ్ని బాణాలతో కొట్టి చంపాలి. ఇదే నాకోరిక. తీర్చాల్సింది ఏలిక. "
చిలుక కోరికవిని అదిరిపడ్డారు అక్కడవారంతా, రాయలు నోట మాటరాకుండా దానివంకే చూడసాగాడు. రామలింగడు ఒకింత చిరాకుపడి "ఇది చిలుక కాదు. సాక్షాత్తు మనస్సులేని మనిషి .నిలువెత్తు విషపు మనిషి.."అని రుసరుసలాడాడు. బోయవాడికి ప్రాణభయం వేసింది.."మా రాజా నేను పిట్టలను తిని బతికేటోడిని. ఈ చిలుక నన్ను చూపించి నన్ను చంపేయమంటోంది. నా భార్యపిల్లలు దిక్కులేనివారవుతారు. నా పుట్టుకలో నా వృత్తి రాసిపెట్టి ఉంది.” అని భోరున ఏడవసాగాడు. ప్రాణభయంతో గజగజలాడిపోసాగాడు.
“ఓ చక్రవర్తీ నా కోరిక తీర్చగలనని మాటిచ్చారు. ఒకవేళ కాదంటే నేను తమపాదాలచెంత ప్రాణాలువిడుస్తాను. వాడిని వదలొద్దు. ఆనాడు నేను నాతల్లీ, తండ్రిని, నా తోడబుట్టిన వారిని ఈ దుర్మార్గుని కారణంగా కోల్పో యాను. విలువైన నా బాల్యం అంతా అష్టకష్టాల పాలయ్యింది. ఆబాధతో నా జీవితం వీడికోసమే వెచ్చించాను. ఏదో తిని బతికి ఓ మనిషిలా పలు విద్యలు, నేర్చుకున్నాను. చివరికి మీ మన్ననలు పొంది నా కార్యం సాధించుకున్నాను. మాట తప్పవద్దు కాదనరని నమ్ముతున్నాను.” అని పంజరంలో చిలుక గంగవెర్రులెత్తిపోతూ చక్కర్లు కొట్టింది.
రాయలు బిక్కముఖంతో మిగిలాడు. రామలింగడు రాయలు పరిస్థితిని చూసి “ఓ చిలుకా నా మాటవిను. నీ కోరిక అసమంజసం. వేట వృత్తి గా బతికే బోయజాతి రోజు ఎన్నో పిట్టలిని చంపి తింటారు. యుగయుగా లుగా వస్తున్నది. నీవు శాంతచిత్తురాలవుకమ్ము. నీవు శాఖహారివి, ఇట్టి జీవహింస నీవుకోరరాదు. నీకు శాస్త్రపరిజ్ఞానం ఉంది. నీ వంటి పక్షిని ఇంత వరకు మేమెవ్వరం చూడనేలేదు. నీవు జ్ఞానపక్షివి. నీవు ఇలాంటి నీచపు కోరికలను అడిగి హీనపడవద్దు.”
“రామలింగకవీ, నీవు శాఖహారివై ఉండికూడా ఆ పచ్చిమాంసం భుజించే వాడిని వెనుకవేసుకుని నన్ను కాదంటావా ? ఇదేనా నీపెంపుడు చిలుకనైన నా పైనీ అనురాగం. అవునులే రాయల కనుసన్నల్లో కదా నీబతుకు, వంతపాటతో కాలం వెళ్లబుచ్చాలి. అయినను నీతో ఇప్పుడు నాకు పని ఏమిటి? ఓ సమరాంగన చక్రవర్తి. ధర్మం తప్పద్దు. నాకోరిక తీర్చండి. లేకుంటే ఓపక్షికి న్యాయం చేయలేని వాడిగా చరిత్రలో మిగిలిపోతావు."
రాయలు బిక్కముఖంవేసాడు. చిలుక మాటలు శూలాల్లా ఉన్నాయి. పక్కనే నిలుచున్న దండనాయకున్ని “నీవైతే ఏంచేస్తావు ?” అని అడిగాడు. అందుకు అతడు బదులిచ్చేలోపే ఆ చిలుక గొంతు విప్పింది.
“యవనరాజ్య స్థాపనాచార్యా భలేగుంది మీతీరు. ఎవరైనా వింటే నవ్విపోగలరు. చక్రవర్తి ముందు ఛత్రము పట్టే దండనాయకుడా తీర్పు నిచ్చునది. నాకోరిక తీర్చలేకుంటే నన్ను వదిలేయండి. ఏగజపతుల కాళ్లుపట్టుకుని నాపని చేసుకుంటాను. ఈ బోయవాణ్ణి వదలను”
రాయలు ఆ చిలుకను చూస్తే ఒళ్లుమండుతున్న దాని మాటల్లో ధర్మం ఉంది. కనుక ఇచ్చిన మాట నిలుపుకోవాలి. అని నిశ్చయించాడు.
"పిట్టలను తిని బతికే జాతివాడైనా ఆ బాధిత పిట్టవచ్చి ఫిర్యాదు చేస్తే శిక్షించకతప్పదు. కనుక యావజ్జీవకారాగారశిక్ష విధించుచున్నాను. ఈ శిక్ష మరణదండనతో సమానం. ఓ చిలుకా! నీకిచ్చిన మాట చెల్లించాను. ఎంతటివారైనా ఒకరి ప్రాణం తీయమని కోరరాదు. అట్టి కోరికలను ఎవరూ తీర్చరాదు. ఫిర్యాదు వరకే నీవు. శిక్షవేయునది మేము. నీకు తెలియును కదా ! రాజు, రాజధర్మమూ ! ఇక నీవు యధేశ్చగా స్వతంత్ర జీవనాన్ని గడుపు " అని చెప్పి పంజరంలో చిలుకను తనే వదిలేసాడు. చిలుక బయటికి వచ్చి " మీ ధర్మం ప్రశంసనీయం. కానీ నా కోరిక తీరలేదు. కొన్నాళ్లు తరువాత ఆ బోయవానికి విడిచిపెట్టండి. అక్షరజ్ఞానం లేనివానికి ఏం తెలుస్తుంది. ఒకవేళ వాడికి బుద్ది వచ్చిన ఏమి లాభం ? చచ్చినా నా బంధువులు తిరిగిరారు. నేను ఒక పక్షిగా పెరిగి ఉంటే నా కోరికలు మరోలా ఉండేవి. కానీ, నేను పండితుల వద్ద నాబాల్యం అంతా గడిచి పోయింది. పలు శాస్త్రములను తెలుసుకున్నాను. ఓమనిషిలా తయారయ్యాను. చివరికి మనిషిలా ఆలోచించాను. మహాపండితులను పోషించే రాయలవారి మనస్సును రంజింపచేసాను. మరోదశలో బాధ కలిగించాను. అందుకు క్షంతవ్యుడను. " అని ఒకింత బాధపడింది.
ఆ చిలుక రామలింగనివద్ద కడసారి వీడ్కోలు తీసుకుని గగనంలోకి ఎగిరిపోయింది. రాయలు, రామలింగడు భారమైన మనస్సుతో ఆ చిలుక కన్పించేమేర వరకు చూసారు. “రామలింగా ! మాటలాడే చిలుకలను, మైనాలను చూసాను కానీ ఇలాంటి చిలుకను చూడలేదు. దానితో మాటలు ఆడితే సమయం తెలియదు. మంచి విజ్ఞానసంపద కలిగిన పక్షిరాజు” అని రాయలు చిలుకను సాకకుండా వదిలేసామన్న భాదతో నింగివైపు చూస్తూ చెప్పాడు.
విచారించకండి ప్రభూ ! రెండేళ్ళు పెంచాను. నాకెలాంటి బాధలేదు. కారణం అది స్వతంత్రజీవనానికి వెళ్లిపోయింది. మనమెంత వైభవంగా చూసినా స్వతంత్రజీవనంలో ఉన్న ఆనందం వేరు కదా !" అన్న రామలింగని మాటలకు రాయలు గాఢంగా నిట్టూర్చాడు.
Comments