శ్రీరాముని పట్టాభిషేకానికి సదస్యుల హర్షం
ఆ సభలో దశరథుడు తన సభలో వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు : మహాజనులారా! పూజ్యులారా! మా పూర్వీకులంతా ప్రజలను తమ సొంత బిడ్డల్లా చూసుకొని పరిపాలించారు. ఇక్ష్వాకుల రాజవంశంలో జన్మించిన నేను కూడా వారి దారినే అనుసరించాను. లోక కళ్యాణాన్నేవాంఛిస్తూ వచ్చాను. ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాలు గడచిపోయాయి. ఫలితంగా నా శరీరమంతా పండి ఒడిలిపోయింది. ఇట్లాగే ఇంకా ఎక్కువ కాలం పరిపాలించలేను. నా శరీరం విశ్రాంతిని కోరుకుంటోంది.
నా కుమారుడు రాముడు. దేవేంద్రునితో పోల్చదగిన పరాక్రమవంతుడు,శత్రుభయంకరుడు, సకల గుణాభిరాముడు. నా రాముడు కూడా నా పోలికలనే పుణికి పుచ్చుకున్నాడు. పుష్యమీ నక్షత్రంతో కూడిన చంద్రునిలా చల్లగా ప్రకాశిస్తూ ఉంటాడు. ధర్మసంరక్షకులలో శ్రేష్టుడు. అటువంటి రామునికి రాజ్యాభిషేకం చేయాలని అనుకుంటున్నాను. అతడు మూడు లోకాలనూ మెప్పించగల సమర్థుడూ, యోగ్యుడూ అని అనుకుంటున్నాను. నేనీ రాజ్యభారాన్ని రాముని భుజస్కంధాల మీద ఉంచినట్లయితే లోక అభివృద్ధి జరుగుతుంది. ఏ
విధమైన కొరతా లేకుండా నేను విశ్రాంతి తీసుకోగలుగుతాను. ఈ విషయాన్ని అన్ని కోణాలనుంచీ బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొన్నాను. ఇది మంచి ఆలోచనేనని, ఇందువలన ప్రజలు సుఖపడతారని మీరు కూడా భావిస్తే, నేను ఇలా చేయడం సముచితమేనని మీరు కూడా భావిస్తే ఈ పని చేస్తాను. మీ సంపూరాంగీకారం లేకపోతే నేనీ పని చేయను. నన్ను మెప్పించడంకోసం ఒప్పుకోవలసిన అవసరం లేదు. మరేదైనా మంచి ఆలోచన ఉంటే చెప్పండి. అట్లాగే చేద్దాం. ఇది యావత్తూ రాజ్య క్షేమానికి సంబంధించిన విషయం. సమష్టిగా ఆలోచించి, మంచి నిర్ణయం తీసుకోవాలి. అందుకే మిమ్మల్నందరినీ రమ్మని చెప్పాను. ఎన్నో కష్టనష్టాలను లెక్క చేయకుండా పిలవగానే మీరు కూడా వచ్చారు. ఒక్కరే తీసుకునే నిర్ణయం మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చునేమోనని, మీ అందరినీ పిలిపించాను. మీరంతా మధ్యస్థులు. మీకు అందరూ సమానమే. అందువల్ల పూర్వాపరాలు బాగా ఆలోచించి నిష్పక్షపాతంగా, ప్రజాక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మంచి నిర్ణయం చెప్పగలరనే మిమ్మల్ని సమావేశపరచాను. మీరు అందరూ బాగా ఆలోచించి మీ నిర్ణయాన్ని చెప్పండి.
ఈ విధంగా పలికి దశరథ మహారాజు కూర్చున్నాడు. సభలోని రాజుల, రాజోద్యోగుల, ఋషుల, మంత్రుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. మహదానంద పడిపోయారు. వారి మనస్సులు పురివిప్పిన నెమళ్ళలా నాట్యం చేశాయి. ఆనందంతో చప్పట్లు చరిచారు. బాగు బాగు అంటూ తమ ఆమోదాన్ని తెలిపారు.
అప్పుడు సభికులు మహారాజుతో ఇలా అన్నారు: మహారాజా! తాము పలికిన పలుకులన్నీ అక్షర సత్యాలే! మీరు అనేక వేల సంవత్సరాల నుండి రాజ్యభారాన్ని మోస్తూ అలసి ఉన్నారు. మీకు విశ్రాంతి తప్పక అవసరం.అందువలన రాజ్యభారాన్ని మోసేందుకు యువరాజుగా రాముని నియమించండి.
రాజా! రాముడు మా అందరకూ ఎంతో ప్రియమైనవాడు. మహావీరుడు, రఘుకుల సంజాతుడు, ఆజానుబాహుడు అయిన రాముడు పట్టాభిషిక్తుడై శ్వేత ఛత్రధారియై పట్టపుటేనుగు అంబారీపై ఊరేగుతూ ఉంటే చూడాలని మా నేత్రాలు ఉబలాట పడుతున్నాయి.
అప్పుడు దశరథుడు సభికులతో ఇలా అన్నాడు : ఓ సభికులారా! మీ మాటలను బట్టి మీరందరూ నన్ను సంతోషపెట్టడానికి, నా మాటకు ఎదురుచెప్పలేక ఇలా పలుకుతున్నారు. అంతేకాని యథార్థమైన మీ అభిప్రాయాలను వ్యక్తం చెయ్యటం లేదు.
మహాజనులారా! ఈ విషయంలో యథార్థమైన మీ అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పండి. నేను ధర్మానుసారంగా ఇన్ని వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసిన విషయం మీరు ఎరుగుదురు. మీరు యథార్థమైన మీ అభిప్రాయాన్ని తెలుపడం లేదని సందేహిస్తున్నాను. కనుక మీరందరూ రాముడే యువరాజు కావాలని ఎందుకు కోరుకొంటున్నారు? నిర్భయంగా తెలుపండి.
అప్పుడు సభికులు దశరథ మహారాజుతో ఇలా అన్నాడు: రాజా! నీ కుమారుడైన రామునిలో అనేక కళ్యాణ గుణాలున్నాయి. రాజా!
రాముడు బుద్ధిమంతుడు, సద్దుణాలలో దేవతలతో సమానుడు. రాముడు అందరికీ ఇష్టమైనవాడు.
రాజా! దివ్యమైన దేవేంద్రునితో సమానుడు. ఇక్ష్వాకు వంశ రాజులందరిలోనూ బలవంతుడు. ధర్మం పట్ల, సత్యం పట్ల అసక్తి గల రాముడు ప్రజలకు సర్వ సంపదలనూ చేకూర్చగల సమర్థుడు. రాముని గుణాలనేమని వర్ణించగలం? అతడు పరాక్రమంలో దేవేంద్రుని
మించినవాడు. బుద్ధిబలంలో బృహస్పతిని మించినవాడు, జనులకు ఆహ్లాదాన్ని ఇవ్వడంలో చంద్రునితో పోల్పదగినవాడు.
రాజా! రాముడు ధర్మాలన్నీ తెలిసినవాడు. సత్యసంధుడు; అసూయలేనివాడు,భూదేవివంటి సహనం గలవాడు. దుఃఖీతులను, అభాగ్యులను సదా వెన్నంటే ఉంటూ కాపాడతాడు. జితేంద్రియుడు. రాముడు సుకుమారుడు. మంగళకరమైనవాడు; ప్రియమైన
పలుకులనే పలుకుతాడు. ధర్మపరాయణులైన వృద్ధులను, బ్రాహ్మణులను కీర్తిస్తూ, తన యశస్సును, తేజస్సును పెంపొందించుకొంటున్నాడు.
రాజా! అస్త్ర విద్యలో రాముడు దేవతలను, రాక్షసులను కూడా మించిపోయాడు. వేద విద్యలన్నీ సాంగోపాంగంగా అధ్యయనం చేసినవాడు. దైన్యమన్నదే ఎరుగడు. యుద్ధం చేయవలసి వస్తే లక్ష్మణునితో కలసి వెళ్ళి జయంతో తిరిగి వస్తాడు. అలా విజయలక్ష్మితో తిరిగి వచ్చిన రాముడు గుర్రంపై గాని, ఏనుగుపై గాని ఊరేగుతూ, వారి కుశలాన్ని విచారిస్తాడు. వారి తల్లితండ్రుల సుఖశాంతులను విచారిస్తాడు. అగ్నిహోత్రాదులు సక్రమంగా జరుగుతున్నాయా? అని వారందరినీ తరచి తరచి అడుగుతుంటాడు. అలా విచారిస్తున్న రాముని జనులందరూ జయజయధ్వానాలతో ముంచెత్తుతుంటారు.
రాజా! మా కొరకు నియోగించబడిన రాజోద్యోగుల నుండి సేవలు అందుచున్నవా? అని మమ్మల్ని ప్రశ్నిస్తూ రాముడు ప్రజల కష్ట సుఖాలన్నింటిలోను పాలుపంచుకొంటూ, వారిలో ఒకడై సంచరిస్తాడు. యుక్తిచేత ప్రజల కలహాలను తీర్చి సమాధాన పరచుతాడు.
రాజా! రాముని మనోహరమైన రూపాన్ని ఏమని వర్ణించగలం? అందమైన కనుబొమలు కలిగి చెంపకు చారడేసి కన్నులతో విరాజిల్లుతున్నాడు. సమస్త సద్గుణాలచే శ్రీమహావిష్ణువుతో పోల్పదగినవాడు. మెలకువ కలిగి ప్రజలను పాలించగల సమర్థుడు. ఇంద్రియాలను జయించిన వాడవడంచే చెడు మార్గాల జోలికి పోడు. ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం కలిగినా ఎదుటివాడు ఫలాన్ని పొందకుండా తప్పించుకోలేడు. ప్రాణాలు తీయవలసివస్తే అటువంటివాడి ప్రాణాలను హరించే తీరుతాడు. ప్రజలకు సుఖశాంతులను కలిగిస్తూ సూర్యభగవానుని మల్లే ప్రకాశిస్తూంటాడు.
రాజా! ఇన్ని సుగుణాలు కలిగినవాడు కనుకనే ప్రజలు అతడినే రాజుగా కోరుకొంటున్నారు.రాముడు నీ పుత్రుడై జన్మించడం నీ పూర్వజన్మల పుణ్యఫలమని భావిస్తున్నాం. మరీచి కుమారుడు కశ్యపుని మల్లే రామునికి కూడా మంచి పుత్రునికి ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి.
రాజా! అలాంటి యోగ్యుడైన రాముడు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ, మమ్మల్ని పాలించాలని, గ్రామవాసులం, పట్టణవాసులం అంతా ముక్తకంఠంతో కోరుచున్నాం. స్త్రీలు, పురుషులు, చిన్న పెద్ద అన్న తేడాలేకుండా రాముని కొరకై ముప్పూుటలా భగవంతుణ్ణి
ప్రార్థిస్తున్నాం.
ఓ రాజశ్రేష్ఠుడా! దశరథ మహారాజా! అటువంటి రాముని యువరాజుగా పట్టాభిషిక్తుని చేసి ప్రజల కోరికను తీర్పు. ఉత్తమ గుణాలు గల రాముణ్ణి, మా క్షేమం కోరి త్వరగా యువరాజును చేయి.
Comments