కుంటోడిపై పదవి ప్రభావం ( Part 2)
అయ్య బాబోయ్ ఇదేదో ఇరుక్కుపోయినట్టున్నాను. అటు గొయ్యి - ఇటు నుయ్యిలా ఉంది, నేను అంతపనిసేయ్యలేను. ఆ బండ ఎత్తే మొకమా నాది. బట్టలమూటవరకు ఏదో పర్వాలేదు. కావాలంటే ఎత్తిసూస్తాను అని ఓ బండరాయిని ఎత్తేప్రయత్నంలో పడ్డాడు. చెమటలు పోసాయి. ఇంచు కూడా కదపలేక పోయాడు. చివరికి చతికిలపడ్డాడు. నావళ్ళకాదురోయ్ దేవుడా అని సన్నగా ఏడుపు లంకించుకున్నాడు. మళ్లీ రాయి ఎత్తే ప్రయ త్నంలో కాళీమాతా గండం దాటించు. నాకు శక్తి ఇయ్యి తల్లే ! అని నింగిలోకి చేతులు ఎత్తి దండాలు పెట్టసాగాడు.
ప్రభూ, నాకో అవకాశం ఇవ్వండి. ఆ తిప్పడుచే ఈ తాళాలు పగుల గొట్టిస్తానుఅని రామలింగడు రాయలవారిని లోగొంతుతో అడిగాడు.
లాభంలేదు రామలింగా, వాడో వింత పశువులా ఉన్నాడు. పైగా బాగా శారీరకంగా బలహీనుడు. ఆ రాయిని ఇంచు కూడా లేపలేకపోయాడు. వాడు నటించలేదు. నిజంగానే ఎత్తలేకపోయాడు. ఇక వీడివలన మనమీ చెరలోంచి తప్పుకోలేం. చూద్దాం ఈ లోగా మన వెనుకనే వస్తున్న మన సైన్యం ఈ సరికి ఈ పరిసరాలకు వచ్చేసి ఉంటుంది అని రాయలు తిప్పడు వలన కాదని ఓ నిర్ణయానికి వచ్చేసాడు.
ప్రభూ నాకో అవకాశం ఇప్పించండి. కాదనకండి అని రాజు నుంచి అంగీకారంపొంది, ఇటు తిరిగి నాయనా, తిప్పా ఒకసారి ఇటు రా! నీకోవిషయం చెప్పాలి అని పిలిచాడు రామలింగడు.
కళ్ళు తుడుచుకుని వచ్చాడు తిప్పడు. చెవులు రిక్కించి వినసాగాడు. తిప్పా! మన నగర దండనాయకుడు లేని కారణంగా ఈ దొంగల్ని పట్టు కోవడానికి మహరాజుగారే బయలుదేరారు. నీకో అవకాశం రాజుగారు కల్పించారు. ఈ క్షణం నుంచి నువ్వే విజయనగర రక్షకుడవు, దండనాయకుడవు. మహరాజుతో సహ పౌరులరక్షణ అంతా నీదే. ఇదిగో రాజముద్రిక అని రాయలనుంచి తీసుకుని తిప్పడికి ఇచ్చాడు. ఆ ముద్రిక తళతళ మెరిసి పోసాగింది.
రాజముద్రిక చేతి వేలికి తగిలించుకున్న తక్షణం తిప్పనిలో మార్పు సంభవించింది. అయ్యో దొంగ వెధవలు ఈసరికి నీళ్లుపోసుకుని వచ్చేస్తుంటారు. ఏటిదారి? ఎలా తప్పించాలి మిమ్మల్ని? మారాజా మన సైన్యాలు ఎటువైపున్నాయో సెప్పండి. లగెత్తుకుని పిలుసుకు వచ్చేస్తాను. ఆ పనికి ఇప్పుడు పెట్టుకోకూడదు ఆ దొంగనాయాళ్లు ఒచ్చీసినారంటే ఎనకాముందు సూడకుండా ఏసేయ్యడమే కదా! ఇంత పెద్ద పదవి ఇచ్చేటోడిని, రక్షించుకోలేని చవటను అనిపించుకోలేను అని పరిపరివిధాలుగా అనుకుంటూ గుహంతా కలియతిరిగాడు తిప్పడు. రాయలు అంతులేని ఆశ్చర్యానికి గురయ్యాడు. రామలింగనివైపు అయోమయంగా చూసాడు. ఏమిటి రామలింగా ఇదంతా, తిప్పడేంటి? కాలుకాలిన పిల్లిలా తిరగడమేమిటి? మనల్ని ఈ వెదవ రక్షిస్తా అంటున్నాడు. చిత్రంగా ఉందే అని రామలింగానితో అన్నాడు. అదే ప్రభూ! పదవి ప్రభావం అంటే...... ఇంకా చూడండి. వాడెన్ని సాహసాలు చేస్తాడో కనులారా తిలకించండి. పదవి చిక్కితే మూలపడున్న ముసలాడు కూడా కత్తిదూస్తాడు. కదనరంగాన విజయానికి ఆరాట పడతాడు... అని రామలింగడు నవ్వుతూ చెప్పాడు.
తిప్పడు ఏదో పెద్ద ఆలోచనకు శ్రీకారం చుట్టినవాడిలా గుహ బయటికి వెళ్లి వచ్చి పెద్దబండరాయిని ఎత్తే ప్రయత్నం చేసాడు. ఏమీ కదల్చలేకపోయినా, ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. రాయలు కన్నార్పకుండా చూస్తున్నాడు. రామలింగడు వాడిని ప్రేరేపిస్తూనే ఉన్నాడు. ఊహించని విధంగా క్షణాల్లో రాయి లేచింది. చొట్టకాలును తప్పటడుగు పడకుండా వేస్తూనే బలంగా తాళం మీదకు విశిరాడు. ఊడివచ్చింది. చెమటలు పోస్తూనే మారాజా! తమరు ఈ గుహలోంచి రావద్దు. ఆ దొంగలసంగతి నేను చూసుకుంటాను అని చెప్పి బయటికి దూసుకుపోయాడు కుంటికాలితో వడివడిగా అడుగులు వేసుకుంటూ పోయాడు.
ఏమిటి రామలింగా! వీడి రక్షణ మనకు అవసరమా? పదా నా కరవాల విన్యాసం కనులారా చూద్దువుగాని.... ఆ దొంగల్ని ఏ ఒక్కడిని వదలకుండా మట్టికరిపిస్తాను అని రౌద్రమూర్తి అయ్యాడు రాయలవారు.
ప్రభూ! మనకెందుకా వృధా శ్రమా, తిప్పనికి అధికారం ఇచ్చారు కదా! చూడండి, పదవీ ఏమైనా చేయిస్తుంది అన్న నగ్నసత్యం తమకు అవగతం అవుతుంది. కొంతసేపు ఓపిక పట్టండి. తిప్పడు వలన కాకపోతే తమకు ఎలాగూతప్పదు అని రాయలవారిని ముందుకు పోకుండా నిలువరించాడు రామలింగడు.
నిజమే రామలింగా, చూద్దాం ఇంతకీ మన సైన్యం ఏమైంది? బహుశా దొంగలతో తలపడుతున్నారేమో ఏదీ తెలియకుండా అయి పోయింది. నువ్వేమో తిప్పడు పై ప్రయోగం చేస్తున్నావు అని రాయలు గుహలో ఆకలిగొన్న బెబ్బులిలా తిరుగాడసాగాడు.
తిప్పడు కుంటుకుంటూ నదివైపు సాగాడు. అక్కడ దొంగలగుంపు తీవ్రంగా ఆలోచిస్తోంది, మనం బందించినవారిలో ఒకడు బాపడు, మరొకడు ఖచ్చితంగా మారాజు ఆ దేవరాయలే. గజపతులకు అమ్ముకుంటే మనం ఏదైనా దుర్గంకు అధిపతులు కావచ్చు అని ఒక దొంగ చెప్పాడు.
సరిగ్గా అప్పుడే వెళ్లాడు తిప్పడు. దొంగలు వాడిని చూడగానే తిప్పా బందిఖానాలో ఉన్నవారిని చూసావా? అతడు దేవరాయలే కదా అని ఆ దొంగల నాయకుడు ఆత్రంగా అడిగాడు.
చుట్టూ కూర్చున్న ఆ గుంపు మద్యలో నిలబడి అదే చెప్పాలని వచ్చాను మీరే అడిగారు, అతడు మారాజే, మరొకడు కొత్తగా వచ్చిన కవి అని చెప్పి కిందికి వంగి ఏటి ఇసుకను దోసిల్లుతో తీసి శరవేగంతో వారి ముఖాలపై విశిరికొడ్తూ బొంగరంలా తిరిగాడు. క్షణాల్లో అంతా కళ్లు చేత్తో అదుముకుని నేలమీదపడి గింగరాలు కొట్టసాగారు. వారి కళ్ల నిండా ఇసుక. అప్పటికే అక్కడకు చేరుకున్న సైన్యం దొంగలపై పడి సునాయాసంగా బందించింది.
రాయలు చాకచక్యంతో దొంగల్ని పట్టుకున్న తిప్పడిని అభినందిం చాడు. అప్పటికి అసలు విషయం తెలుసుకున్న దొంగలనాయకుడు రాజా నీవు చేతికి చిక్కితివి. కానీ, నిన్ను గుర్తించలేక చేతులారా వదిలేసాను. సరిగ్గా నిలబడలేని ఈ కుంటిచాకలికి ఇంత తెగింపు ఎలా వచ్చింది అని జుట్టుపీక్కోసాగాడు.
రామలింగా నీతెలివికి, సమయస్పూర్తికి నిన్నెలా అభినందించాలో తెలియకున్నది, తిప్పనిపై నీప్రయోగం ఓ అద్భుతం. పదవిలో ఇంత సాహసం ఉందా ? అది అనుభవించిన నాకంటే నీవే చక్కగా గుర్తించి తిప్పడిపై గురిపెట్టావు అని కొనియాడాడు.
Comments