ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
భోజరాజు సింహాసనం ఎక్కడానికి మొదటి మెట్టుపై పాదం పెట్టగానే ఆ మెట్టుపై ఉన్న రత్న ప్రతిమా భోజరాజుని చూసి అతడు అత్యంత ఆశ్చర్యం చెందేలాగా మనుష్య వ్యాఖ్యలతో ఇలా అన్నది.
ఓ భోజరాజా! నీవు ఈ సింహాసనాన్ని అతికుతూహలంతో ఎక్కుటకు ప్రయత్నించి వచ్చిన వాడివి కానీ దీనిని ఆరోహించటానికి గాని, దీనిపై ఆసీనుడు అగుటుకు గాని సామాన్యులకు సాధ్యము కాదు. ఇది సాహసం మరియు దానాలలో గొప్పవాడు, జగత్తులో ప్రసిద్ధి చెందిన వాడు, రాజులలో పరమేశ్వరుడైన విక్రమార్క రాజశేఖరుని సింహాసనం. దీనిపై అతడు కానీ అతనితో సమానమైన వారు కానీ ఎక్కాలి కానీ ఇతరులు అర్హులు కాదు. విక్రమార్కునికి ఇది దేవేంద్రుడిచే ఇవ్వబడింది కానీ మనుషులచే నిర్మించబడింది కాదు.
ఆ పృథ్వీ నాయకుడు గతించిన తర్వాత ఇది భూమిలో పూడ్చిపెట్టబడింది. అలా చేయటానికి కారణం కలుదు. నా లాగానే ఈ సింహాసనానికి కల 32 మెట్లపై ఉన్న 32 బొమ్మలు మాట్లాడగలవు. దీని కొరకు నువ్వు ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. బొమ్మలుగా ఉండి కూడా మాకు మాట్లాడే శక్తి కలగడానికి కారణం లేకపోలేదు, మెల్లగా నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, దిగాంత విశ్రాంత కీర్తి ధనుడు, సకల విద్యా విశారదుడు,చతుష్టష్టి కళాధ్యక్షుడు, అసమాన శౌర్య,ధైర్య, గాంభీర్యా పరాక్రమ శోభితుడు, సాహస, దాన గుణాది సకల సద్గుణ సంపూర్ణుడైన విక్రమార్క రాజు వంటి లక్షణాలు నీకు కలిగి ఉంటేనే నీవు ఈ సింహాసనాన్ని ఎక్కి కూర్చో,లేనిచో నీ కోరికను వదులుకో. నా మాటలను నిరాకరించి ఎక్కడానికి ప్రయత్నిస్తే దానివలన నీకు హాని సంభవిస్తుంది. ఆలోచించక తొందరపడి ఏ కార్యమును చేయరాదని పెద్దవారు చెప్పే నీతి వాక్యాలను తలుచుకొని,సింహాసనం ఎక్కవద్దని మొదటి సాలభంజిక ఆపివేసింది.
అప్పుడు భోజరాజుకు కలిగిన ఆశ్చర్యం అంతింతకాదు. భోజరాజు లాగానే సభా మండపాన చేరిన అందరూ విస్మయంతో అలాగే చూస్తున్నారు. భోజుడు సింహాసనం ఆరోహించడం మాని ఆ సాలభంజికతో, ఓ బొమ్మ! నీ వాక్యాలు వినగా నా మనసుకు అధికమైన ఆశ్చర్యం కలుగుతుంది. ఈ సింహాసనం ఎవరిది అని నువ్వు చెప్పావో, ఆ విక్రమార్కుడి చరిత్ర నాకు తెలియదు. అతని గుణములు వంటి గుణాలు నా దగ్గర ఉన్నవో లేవో చెప్పుటకు నాకు సాధ్యం కాదు. ఇంతటి శక్తి కలిగి ఉన్న నీవే అది నిర్ణయించాలి. ప్రతిమలుగా ఉన్నా కూడా నీ సామర్థ్యం అద్వితీయమై ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. నా కోరికను అంగీకరించి విక్రమార్కుని చరిత్ర ఎలాంటిదో, అతని గుణం ఎలాంటిదో చెప్పుము వినాలని అనుకుంటున్నాను అని ప్రతిమను అడిగాడు.
అప్పుడు ఆ ప్రతిమ సంతోషంతో భోజరాజుతో నరేశ్వరా! పరమయోగ్యుడైన కీర్తి ప్రతిష్టపరుడగు విక్రమార్క మహినాధుడి చరిత్ర చాలా గొప్పది. వినదగినది అతని గుణ విశేషాలను వర్ణించి పలుకుటకు నా శక్తి కొలది చెప్తాను. అతని వృత్తాంతం నీవు నీవు వినాలి అని కోరడం తగినదే, నేను చెప్తాను సావధాన మనసు కలిగి ఆలకింపము అని చెప్పింది.
Comments