గౌతమ మహర్షి ఇంద్రుడికి,అహల్యకి ఏమని శాపాలు ఇచ్చాడు?
ఇప్పుడు మనం రామలక్ష్మణులు ఆశ్రమం గురించి విశ్వామిత్రుని అడుగుతారు కదా దాని గురించి తెలుసుకుందాం!
విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి ఇలా చెబుతాడు. ఇది గౌతమ మహర్షి ఆశ్రమం, ఆయన దర్శనం కోసం దేవతలు ఈ ఆశ్రమానికి వచ్చే వారు. ఆ గౌతముడు తన భార్య అయిన అహల్యతో కలిసి తాపసిగా ఇక్కడ నివసించేవాడు. అహల్య బ్రహ్మదేవుడి మానస పుత్రిక, అద్భుతమైన సౌందర్యం కలిగినది. ఇంద్రుడికి అహల్య మీద కోరిక వలన ఒకరోజు ఉదయాన్నే గౌతమ మహర్షి సంధ్యావందనం కోసం నది కి వెళ్ళిన సమయంలో, గౌతమ మహర్షి వేషంలో ఇంద్రుడు ఆయన ఇంటిలోకి ప్రవేశించాడు. ఇంటిలోకి ప్రవేశించి అహల్యతో నేను నీ సంగమాన్ని కోరుకుంటున్నాను అని అన్నాడు.
అహల్య కి వచ్చింది గౌతముడు కాదని తెలుసు, ఇంద్రుడు అని కూడా తెలుసు. కానీ ఆమె కన్యగా ఉన్నప్పుడు ఇంద్రుడి మీద మనసులో కోరిక ఉంది, అందువలన ఇంద్రుడితో సంగమించింది.
అహల్య తరువాత ఇంద్రుడితో ఇలా పలికింది, నేను నీతో సంగమించి చాలా ఆనందం పొందాను. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో గౌతముడు నుండి నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్పింది. ఇంద్రుడు ఒక నవ్వు నవ్వి నేను నేను చాలా ఆనందం పొందాను, ఎలా వచ్చానో అలానే వెళ్ళిపోతాను అని చెప్పి ఆశ్రమం నుండి బయటికి రాగానే దేవతలనూ, దానవులను ఆపగల మరియు శపించగల అపారమైన తపఃశక్తి గల గౌతమ మహర్షి బయటికి వస్తున్న ఇంద్రున ముఖం చూసి జరిగింది గ్రహించాడు. ఇంద్రుడి ముఖం మాడిపోయింది.
అప్పుడు గౌతమ మహర్షి ఇంద్రుడి తో ఇలా అన్నాడు: నా రూపం ధరించి నువ్వు తప్పు చేశావు, స్త్రీల మీద నీకు ఇంత కామం ఉండటానికి కారణం నువ్వు పురుషుడువన్న అహంకారం
, కావున పురుషత్వానికి చిహ్నములైన నీ అండములు నేల జారి పడిపోగా క అని శపించాడు.
అహల్య వైపు చూసి గౌతముడు ఇలా అన్నాడు" నువ్వు ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఆహారం తీసుకోకు, గాలిని భక్షించు, నీ మీద బూడిద కప్పబడి ఉంటుంది. కావున నీవు ఎవరికీ కనబడవు, కొంతకాలానికి ఈ ఆశ్రమానికి దశరధుని పుత్రుడైన రామచంద్రుడు వస్తాడు, ఆయన ఈ ఆశ్రమం లోకి ప్రవేశించగానే నీకు శాపవిమోచనం కలుగుతుంది. ఆయనకు ఆతిథ్యమిచ్చి సత్కారాలు చేయి, అప్పుడు నువ్వు తిరిగి నా భార్య స్థానాన్ని పొందుతావు. అప్పటి దాకా నేను హిమవత పర్వతం లో ఉంటాను అని వెళ్ళిపోయాడు.
ఇంతలో ఇంద్రుడు దేవలోకంలో దేవతలకి జరిగినదంతా చెప్పాడు. నేను కామంతో ఈ పని చెయ్యలేదు, గౌతమ మహర్షికి తపఃశక్తి పెరిగిపోతుంది, ఆయనను నేను ఏమీ చెయ్యలేను, అందుకనే అపచారం అహల్య పట్ల చేశాను. ఆగ్రహించిన గౌతముడు నన్ను అహల్యను శపించడం వలన కొంత తపశ్శక్తిని కోల్పోయారు. మిమ్మల్ని రక్షించడం కోసం నా అండాలను పోగొట్టుకున్నాను కావున మీరే నాకు అండాలను తీసుకువచ్చి పెట్టాలని అన్నాడు.
అప్పుడు దేవతలు అందరూ కలసి పితృదేవతల వద్దకు వెళ్లి అడగగా, అప్పుడు పితృ దేవతలు మానవులు యజ్ఞం చేసేటప్పుడు మేషము లను మీకు బలిస్తారు, ఆ ప్రకారంగా మీరు మేషముల యొక్క అండాలను దేవేంద్రుడికి ఇవ్వండి అని అన్నారు.
అలా దేవతలు గొర్రెల అండాలను ఇంద్రుడికి ఇచ్చారు. అలా పోగొట్టుకున్నా పురుషత్వాన్ని ఇంద్రుడు పొందాడు, అప్పటి నుంచి ఆయనను మేషవృషణడు అని పిలిచారు.
అహల్య గురించి తెలుసుకున్నాక విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి ఆ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. శ్రీరాముడు ఆ ఆశ్రమంలోకి వెళ్ళగానే ఇన్ని సంవత్సరాల నుండి శాపగ్రస్తురాలైన అహల్య పైకి లేచింది, ఆవిడని చూడగానే రామలక్ష్మణులు ఆమె కాళ్ళకి నమస్కారం చేశారు. గౌతమ మహర్షి చెప్పిన విషయం గుర్తుకు వచ్చి, వచ్చిన వాడు రాముడని గ్రహించిన అహల్య రాముడికి నమస్కారం చేసింది. వాళ్ళకు భోజనం పెట్టింది, అప్పుడు అక్కడికి వచ్చిన గౌతమ మహర్షి అహల్యతో కలిసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. తరువాత వారు మిథిలా నగరానికి చేరుకున్నారు. ఆ నగరం వాహనాలతో, మహర్షులతో, యజ్ఞయాగాలు చేసుకునే వాళ్ళతో ఉన్నది.
విశ్వామిత్రుడు తన రాజ్యంలోకి వచ్చాడని తెలుసుకున్న జనకుడు పరుగు పరుగున తన పురోహితుడైన శతానందుడు తో వచ్చాడు. మీరు రావడంతో నా యాగం ఫలించిందని విశ్వామిత్రుడిని గౌరవంగా పూజించారు. పక్కనే ఉన్న రామలక్ష్మణులని చూసిన జనక మహారాజు ఈ పిల్లలు ఎవరు, ఖడ్గాలు కోదండాలు పట్టుకున్నారు, అందంగా ఉన్నారు, అపారమైన తేజస్సును కలిగి ఉన్నారు, ఎవరు అని అడిగారు.
వాళ్ళిద్దరూ దశరథ మహారాజు కుమారులు, నా యాగ రక్షణ కోసం తీసుకొచ్చాను. రామలక్ష్మణుల రక్షణలో నా యాగం పూర్తి అయింది అని విశ్వామిత్రుడు చెప్పాడు. అయితే మీరు ఆశ్రమంలో నా తల్లిని చూశార అని శతానందుడు వాళ్ళని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు శతానందుడు తో ఇలా అన్నాడు. రాముడు ఆశ్రమంలో అడుగుపెట్టగానే మీ తల్లి శాపవిమోచనం అయ్యింది, గౌతమడితో కలిసి తపస్సు చేసుకోవడానికి వెళ్లారు అని చెప్పాడు. అది విని శతానందుడు చాలా సంతోషించాడు.
తరువాత శతానందుడు రామలక్ష్మణులతో విశ్వామిత్రుడు మీ గురువు కావడం చేత మీరు ధన్యులయ్యారు, ఆయన బ్రహ్మర్షి కావడానికి చాలా కష్టపడ్డారు. నేను ఇప్పుడు మీకు విశ్వామిత్ర మహర్షి కథ చెబుతాను అని శతానందుడు విశ్వామిత్రుడు గురించి చెప్పడం ప్రారంభించాడు.
Comments