సనత్కుమారుడు ఎవరు? అతడు శివుడికి ఇచ్చిన వరం ఏమిటి?
ఇంతకుముందు మనం కుమారస్వామి జననం వెనకాల ఒక కథ ఉంది అనుకున్నాము కదా! అదేనండి సనత్కుమారుడు కథ అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం!
సనత్కుమారుడు అని బ్రహ్మ మానసపుత్రుడు, అతను గొప్ప జ్ఞాని. అతనికి ఒక రోజు ఒక కల వచ్చింది, ఆ కలలో అతనికి రాక్షస సైన్యాలపై యుద్ధం చేస్తున్నట్లు కల వచ్చింది.
వెంటనే తన తండ్రి అయిన బ్రహ్మ దగ్గరకు వెళ్లి నాకు ఇలా కల ఎందుకు వచ్చింది అని అడిగాడు. అప్పుడు బ్రహ్మ నీవు పూర్వజన్మలో వేదాలు చదివేవాడివి, వేదాలలో దేవదానవ యుద్ధాలు గురించి చదివే వాడివి. కానీ నీకు అప్పుడు రాక్షసులు ఎప్పుడూ ఎందుకు ఇలా వ్యతిరేకిస్తారు అని కోపం తెచ్చుకున్నావు, అందుకే ఇలా కలగా వచ్చింది అది తీరాలంటే నీవు ఇప్పుడు దేవసేనకు అధిపతిగా కావాలి అని అన్నాడు.
ఇది ఇలా ఉండగా పరమశివుడు ఇలా అనుకున్నారు తన కన్నా గొప్ప జ్ఞాని అయిన వాడు తనకు కొడుకుగా పుడితే బాగుండు అని అనుకుంటూ శ్రీశైలం పర్వతం మీద తిరుగుతూ ఉన్నప్పుడు వారికి సనత్కుమారుడు తపస్సు చేసుకుంటూ కనబడతాడు. ఉమా శంకరులు సనత్కుమారుడి దగ్గరికి వెళ్లగా సనత్కుమారుడు తపస్సులో ఉండి వారిని పలకరించలేదు అప్పుడు శివుడు జ్ఞాని అని అహంకారం కదా! ఇంత గర్వానికి కారణం అని సనత్కుమారుడి తపస్సు భంగపరుస్తూ అన్నాడు, నేను వచ్చాను అని గ్రహించి మాట్లాడు లేకపోతే నిన్ను నేను శపిస్తాను అని శివుడు సనత్కుమారుడితో అన్నాడు. అప్పుడు సనత్కుమారుడు శాపమేగా ఇస్తే ఇవ్వండి నన్ను ఏమైనా చేయగలదు కానీ నా ఆత్మను ఏమీ చేయలేదు గా అన్నాడు.
శంకరుడు సనత్కుమారుడి జ్ఞానానికి సంతోషించి వరం కోరుకో అన్నాడు. నాకు వరమా? దేనికి? నాకు అవసరం లేదు. కావాలంటే నేనే నీకు ఇస్తాను అన్నాడు, శంకరుడు ఆనందించి నాయనా! నాకు కుమారుడిగా పుట్టు అని కోరాడు, అప్పుడు సనత్కుమారుడు మళ్లీ కోరుకో అని అన్నాడు. అప్పుడు శంకరుడు అదే కోరికను మళ్ళీ కోరాడు. దానికి సనత్కుమారుడు ఒప్పుకొని నీకే కొడుకుగా పుడతాను అని చెపుతాడు. అప్పుడు పార్వతీదేవి తనకే కాదు నాకు కూడా కొడుకు గా పుట్టాలి అని అంది. అప్పుడు సనత్కుమారుడు అది ఒక్కటి అడగకమ్మా! ఎందుకు? నీ లాంటి వాడు నా కడుపున పుట్టక పోతే ఎలా అని పార్వతి దేవి అడిగింది?
అమ్మా! తొమ్మిది నెలలు మీ కడుపులో ఉండి నీకు పుట్టడం కుదరదు. నేను శివ కుమారుడిని అంటే నీకు కొడుకునే కానీ నీ కడుపున పుట్టను అని చెప్తాడు.
దానితో పార్వతీదేవి బాధపడి నేను కలిసి అడగలేదు కదా! అందుకే ఇలా జరిగింది. అయితే నా కోరికను ఇంకో విధంగా తీర్చు అని అడిగింది, ఎలా అని అడిగితే ఒకప్పుడు భస్మాసురుడు శివుని గురించి తపస్సు చేసి ఒక వరాన్ని పొందాడు, ఆ వరం ఏమిటంటే నేను ఎవరి తలమీద చేయి పెడితే వారు భస్మం అయిపోవాలి అని, ఆ వరాన్ని పరమ శివుడు భస్మాసురుడికి ఇచ్చాడు.
నీ మీదనే పరీక్ష చేస్తానని భస్మాసురుడు శివుని వెంటపడ్డాడు, ఆయన పరిగెడుతున్నట్లు నటించాడు. ఆ సమయంలో నేను నీటి సరోవరం గా మారిపోయాను, అదే శరవణ తటాకం.అది హిమవత పర్వత ప్రాంతాల్లో ఉంది. నీవు నా కడుపున పుట్టకపోయినా, ఆఖరునా పుట్టేటప్పుడు ఆ తటాకం దగ్గర పుట్టాలి. నీ మంత్రం కూడా ఆ తటాకము పేరు మీద గా ఉండాలి అని కోరింది. అందుకే శరవణభవ అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రం. దానికి సనత్కుమారుడు ఒప్పుకొని నేను శివుడు తేజస్సు చేత, నీ తటాకం దగ్గర పుడుతాను అని వరం ఇస్తాడు. ఆ వరం నెరవేరడం కోసం ఇదంతా జరిగింది.
ఇప్పుడు మనం కుమారస్వామికి ఉన్న పేర్లు అవి ఎలా వచ్చాయో తెలుసుకుందాం
శరవణభవుడు, షణ్ముఖుడు, కార్తికేయుడు, సుబ్రహ్మణ్యుడు, అగ్నిపుత్రుడు, గాంగేయుడు, దేవసేనాపతి, కుమారస్వామి, స్కందుడు, మురుగన్, స్వామిమలై.
శరవణభవుడు - రెల్లు మబ్బుల్లో పుట్టినవాడు అదేనండి తటాకం దగ్గర పుట్టాడు కనుక శరవణభవుడు.
షణ్ముఖుడుు- ఆరు ముఖాలు ఉంటాయి కనుక షణ్ముఖుడు.
కార్తికేయుడు- కృత్తికలచే పెంచబడ్డవాడు కనుక కార్తికేయుడు.
సుబ్రహ్మణ్యుడు- అతి పవిత్రమైన వాడు కనుక సుబ్రహ్మణ్యుడు.
అగ్నిపుత్రుడు - అగ్నికి పుట్టినవాడు కనుక అగ్నిపుత్రుడు.
గాంగేయుడు - గంగ కి పుట్టిన వాడు కనుక గాంగేయుడు.
దేవసేనాపతి- దేవతలకు సైన్యాధిపతి కనుక దేవసేనాపతి.
కుమారస్వామి -శివుడి కుమారుడు కనుక కుమారస్వామి.
స్కందుడు-శివ తేజస్సు వలన పుట్టాడు కనుక స్కందుడు.
మురుగన్ - పార్వతి దేవి లాగా అందంగా ఉంటాడు అందుకే మురుగన్ .
స్వామిమలై -శివుడికి ప్రణవానికి అర్థం చెప్పాడు కనుక స్వామిమలై.
Comments