ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

దశరథుడు కైకేయిని నిందించడం || Dasarathudu Kaikeyini Nindinchadam || Ramayanam || Episode - 46

 

 దశరథుడు కైకేయిని నిందించడం


కైకేయి మాటలకు దశరథుని తల గిర్రున తిరిగినట్లయింది. తాను విన్నదంతా కలా, నిజమా అన్న సందేహం కలిగింది. లేక మనస్సేమైనా చెదరి అట్లా వినిపిస్తోందా అన్న భ్రమ కలిగింది. కొద్దిసేపటికి తేరుకుని, కైకేయి వంక చూశాడు. ఆమెపై పెట్టుకొని వచ్చిన తీయని ఊహలన్నీ మటుమాయమయ్యాయి. ఎదురుగా ఒక ఆడపులి ఉన్నట్లు ఉలిక్కిపడ్డాడు. మహామంత్రంచే బంధించబడిన సర్పంలా విలవిలలాడిపోయాడు. కొద్దిగా స్పృహ వచ్చీ రాగానే "అయ్యో!" అని నిట్టూరుస్తూ, కైకేయిని చూసి "ఛీ ఛీ" అని చీదరించుకుంటూ మళ్ళీ స్పృహ కోల్పోయాడు.

అప్పుడు దశరథుడు కళ్ళతో నిప్పులు చెరగుతూ క్రూరాత్మురాలా! మా వంశ నాశనానికి దాపురించావా? నేనుగాని, బాలుడైన రాముడుగాని నీకు ఏం అపకారం చేశాం? రాముడు నిన్ను కౌసల్యకన్నా ఎక్కువగా ప్రేమించాడు.

నువ్వు విషసర్పానివని గ్రహించలేకపోయాను. రాజకుమార్తెవు గదా అని వలచి వివాహమాడాను. నా వంశాన్ని నేనే చేతులారా నాశనం చేసుకున్నట్లయింది గదా! లోకంలో  జనులంతా రాముని గుణగణాలను వేనోళ్ళ స్తుతిస్తున్నారు. నేను వారందరికీ ఏమని సమాధానం చెప్పగలను? కౌసల్య సుమిత్రలను, నా రాజ్యాన్ని, నా సర్వస్వాన్ని గడ్డిపరకలాగా విడిచి పెట్టగలను, కానీ రాముణ్ణి విడువలేను. నాలో చైతన్యం ఉన్నదంటే అది రాముణ్ణి చూసుకునే! రాముడు లేని రోజున నేను మరణించిన వాడితో సమానం. సూర్యుడు లేకుండా జీవరాశి బ్రతుకవచ్చు. నీరు లేకుండా వృక్షాలు జీవించవచ్చు కానీ రాముణ్ణి చూడకుండా నేను బ్రతుకలేను.

ఓ కైకేయీ! నా పై దయ చూపించు. నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను, నన్ను అనుగ్రహించు. నీ రెండు కోరికలు వెనక్కు తీసుకో.

కైకేయీ! భరతునిపై నాకేపాటి ప్రేమ ఉన్నదో పరీక్షించదలచావా? అసలు నీ కిలాంటి ఆలోచన ఎట్లా వచ్చింది? పూర్వం రాముణ్ణి గూర్చి నువ్వేమనేదానవో గుర్తున్నదా? "శ్రీమంతుడైన రాముడే నా పెద్ద కుమారుడు. రాజ్యాధికారంతోసహా ధర్మసమ్మతమైన విషయాలన్నింటిలోను అధికారం పెద్దవాడైన రాముడికే ఉన్నది" అని అందరితో గర్వంగా చెప్పేదానవు. నీ నోట ఈ మాట రోజూ అంతా వింటున్నదే! ఈ రోజు నన్ను ఆటపట్టించడానికి ఇంత క్రూరమైన మాటలు నీ నోట వచ్చాయి. నా మీదా, నా దేశ ప్రజల మీదా కనికరం చూపించు. నీ కఠినమైన మాటలను నీ నోటితోనే ఉపసంహరించు. లోకకల్యాణానికి దోహదం పడు. 

ఓ కైకా! ఇంతవరకూ లోకంలో అంతా బుద్ధిమంతురాలు, నీతిమంతురాలు ఎవరంటే, 'కైకేయి' అని చెప్పుకుంటూ వచ్చారు. అటువంటి నీకు ఇటువంటి దురాలోచన ఎట్లా వచ్చింది. రామరాజ్యాభిషేకం అని తెలియగానే ఈ కోపగృహంలోకి ప్రవేశించావు? నా మీదగాని, రాముడి మీదగాని ఎవరైనా చాడీలు చెప్పారా? వారి చెప్పుడు మాటలకు లొంగిపోయావు. నువ్వు దుఃఖీస్తున్నావు. నన్ను బాధపెడుతున్నావు.

ఓ కైకా! నువ్వు ఇంతవరకు నాకు అయిష్టమైన పని ఒక్కటి కూడా చేయలేదు. ఒక పరుషమైన మాట మాట్లాడి ఎరుగవు. అందువల్లనే నువ్వు మాట్లాడిన మాటలను ఇంకా నమ్మలేకపోతున్నాను.

కైకా! ధర్మాత్ముడు, సత్కీర్తిగల రాముణ్ణి పదునాలుగు సంవత్సరాలు వనవాసం చెయ్యమని ఎందుకు కోరావు? "నాకు రాముడు మహాత్ముడైన భరతునితో సమానుడే" అని చెప్పేదానవు కదా? ఆ మాటలన్నీ ఏమైపోయాయి! రాముడు పసిబాలుడు, సుకుమారుడు. స్థిరమైన ధర్మబుద్ధి గలవాడు. పుట్టినప్పటినుండే రాజభోగాలు అనుభవించినవాడు. అట్టి రాముడు అరణ్యాలలో నివసించగలదని ఎట్లా ఊహించావు? ఎంతమంది దాసీలు, సేవకులు ఉన్నా కూడా రాముడు ప్రతిరోజూ నీకు సేవలు చేస్తూ ఉంటాడు గదా! అటువంటి రాముణ్ణి దూరంగా ఎందువల్ల పంపుతున్నావు?

రాముడు మహావీరుడు. అతడు ధర్మ, దయా, దాన, యుద్ధ, వీరత్వాలనే నాలుగు విధాలైన వీరత్వాన్ని కలిగి ఉన్నాడు. అతడు ఎన్నడూ, నిందాకార్యాలను చేయదు. దానాలు చేసి దీనులను ఉద్ధరిస్తాడు. శుశ్రూష చేత గురువులను మెప్పిస్తాడు. యుద్ధంలో పరాక్రమంచేత శత్రువును జయిస్తాడు.

సత్యం, దానం, తపస్సు, ఇతరుల శ్రేయస్సుకై త్యాగం త్రికరణాలందు శుద్ధి, విద్య, నిష్కాపట్యం, గురుశుశ్రూష మున్నగునవన్నీ రాముని ఐశ్వర్యాలు, నిష్కాపట్యంలో దేవతలతో సమానుడు. తేజస్సులో మహర్షులతో సమానుడు. సహనం, ఇంద్రియ నిగ్రహం, త్యాగం, సత్యం ధర్మం, కృతజ్ఞత, సకల భూతాల పట్ల సమభావం మున్నగునవన్నీ రాముని గుణాలు, ప్రజలందరితోనూ ప్రియంగా మాట్లాడతాడు. రాముడే నాకు దిక్కని నమ్ముకొని బ్రతుకుతున్నాను. నా రాజ్యమంతా నీకు ధారదత్తం చేస్తాను, కానీ రాముణ్ణి మాత్రం అడవులకు పంపవద్దు.

కైకా! నేను వృద్ధుణ్ణయ్యాను. జీవితంలో చివరి భాగాన ఉన్నాను. ఈ వయస్సులో నన్ను దుఃఖభీతుణ్ణి చేయవద్దు, నాపై కరుణ చూపించు. నీకు చేతులు జోడించి నమస్కరిస్తాను. నీకు పాదాభివందనం చేస్తాను. రాముణ్ణి మాత్రం నాకు అనుగ్రహించు. నీ కోరిక ఉపసంహరించుకొని నాకు అధర్మం వాటిల్లకుండా చూడు.

అప్పుడు కైకేయి ఇలా అన్నది: మహారాజా! నీవు మహావీరుడవు. లోకంలో ధార్మికుడవన్న పేరు ఉంది. వరాలు నువ్వే ఇచ్చావు. ఇప్పుడు పశ్చాత్తాపపడి దుఃఖిస్తున్నావు. ఇట్లా మాట్లాడటం వల్ల నీ ప్రతిష్ఠ పెంపొందేదిగా లేదు. పైగా నీతోటి రాజర్థుల ముందు ఏమని బదులు చెప్పగలవు. నీవు ఏ కైకేయి దయచేత ఇన్ని సంవత్సరాలు జీవించి ఉన్నావో అట్టి కైకేయి కిచ్చిన మాట తప్పుతున్నావు. ఎన్నడో యుద్ధంలో ఇచ్చిన వరాలేకాదు, కొద్దిక్షణాలకు ముందు ప్రతిజ్ఞ కూడా చేశావు. ఈ విధంగా మాట తప్పటం అటు రాజులకూ, ఇటు ఇక్ష్వాకుల వంశానికి కూడా కళంకం తెస్తుంది.

డేగకు, పావురానికి మధ్య వైరం వచ్చినప్పుడు శిబిచక్రవర్తి తన శరీరంనుండి మాంసాన్ని డేగకు సమర్పించాడు. అలర్కుడనే రాజు తనను యాచించిన ఒక గ్రుడ్డి బ్రాహ్మణునికి తన నేత్రాలనే దానం చేశాదు. సముద్రం దేవతల కిచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం ఈ రోజువరకూ చెలియలికట్టను దాటి రావడంలేదు. ఇదంతా ఎందుకోసం చేశారు? తాము ఇచ్చినమాట కాపాడుకోవటం కోసం! అందువల్లనే నేటికీ వారిని స్మరిస్తున్నాం. కాబట్టి నీవుకూడా చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకో.

ఓ రాజా! నీ దుష్టబుద్ధి స్పష్టంగా తెలుస్తూనే ఉంది. రాముడికి రాజ్యం కట్టబెట్టి, కౌసల్యతో కులకాలని దురాలోచన చేస్తున్నావు. నీవు నాకు ధర్మాధర్మాలు చెప్పకు. నేను నీ విచ్చినమాట ప్రకారం నా కిచ్చిన వరాలను ఇప్పుడు ఇమ్మని అడుగుతున్నాను. నేనడిగే దాంట్లో కొంచెమైనా అధర్మంగాని, అసత్యంగాని లేదు.

ఓ రాజా! నీ విచ్చిన మాటతప్పి రామునికి రాజ్యాభిషేకం చేసినట్లయితే, నేను ఇప్పుడే ఇక్కడే విషం పుచ్చుకొని మరణిస్తానే గాని, కౌసల్యను రాజమాతగా అంగీకరించను. భరతునిపైన, నాపైన ఒట్టువేసుకొని మరొకసారి చెబుతున్నాను. "భరతుని రాజ్యాభిషేకం, రాముని వనవాసం తప్ప మరేమీ నన్ను సంతోషపరచలేవు. నేను జీవించి ఉండాలంటే ఇచ్చిన రెండు వరాలు వెంటనే అమలు పరచవలసిందే."

దశరథమహారాజు పదేపదే ఎన్నో విధాలుగా చెప్పి చూశాడు. బ్రతిమాలాడు, కాళ్ళావేళ్ళాపడ్డాడు. అయినా ఆమె మనస్సు కరుగలేదు. కొద్దిసేపు ఆమెవంకే చూస్తూ ఉండిపోయాడు. భరతుని పట్టాభిషేకం, రాముని వనవాసం అన్న ఆమె పలుకులు సముద్రఘోషలా వినిపించాయి. మనస్సంతా మొద్దుబారిపోయింది. మొదలు నరికిన చెట్టులాగా కూలిపోయాడు. మతి భ్రమించినవాడిలా పిచ్చిచూపులు చూడసాగాడు. ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడేగాని మాట బయటకు రావడంలేదు. దీనంగా కైకేయి వంక చూడసాగాడు. మందస్వరంతో పలికాదు.

దశరథుడు ఇలా అన్నాడు: ఓ కైకా! నువ్వు ఇంతకుపూర్వం రాముడంటే ఎంతో ప్రేమగా ఉండేదానివి. ఈ రోజున విపరీతంగా మాట్లాడుతున్నావు. ఇంతలో నీకు వచ్చిన భయం ఏమిటి? ఈ బుద్ధి నీకే పుట్టిందా? లేక ఏదైనా దయ్యం పట్టిందా? నీకు నిజంగా నీ భర్తపైన, నీ కొడుకు భరతునిపైనా ప్రేమ ఉన్నట్లయితే రామవనవాసం మాట పూర్తిగా మరచిపో, అది మనందరికీ, వంశానికీ కూడా శుభం కలిగిస్తుంది.

ఓసీ వెర్రిబాగులదానా! భరతుడు రాముడికన్నా ధార్మికుడు. ఈ విషయం భరతుడు వింటే రాముని వనవాసానికి అంగీకరించదు.

అంతేకాదు. రాజులు, సామంతులు, మంత్రులు అందరూ కలసి రామరాజ్యాభిషేకాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. నేను కూడా వారందరి ముందూ అంగీకారం తెలిపాను. ఇప్పుడు పోయి వనవాసం మాటచెబితే నలుగురూ నన్ను హేళనచేస్తారు. రామునికి రాజ్యాభిషేకం చేస్తానని నేనిచ్చినమాట అసత్య మవుతుంది.

ఓ కైకా! ఇంతకాలం కౌసల్య నాకు దాసిగా సేవలుచేసేది. జూదం మున్నగు ఆటపాటల్లో స్నేహితురాలుగా ఉండేది. ఒక సోదరిలాగా నా శ్రేయస్సునే కోరేది. తల్లిలాగా నన్ను లాలించేది. భార్యగా వేదవిహితమైన యజ్ఞ యాగాచులన్నింటిలోను నాకు తోడుగా ఉండేది. ఇన్ని విధాలుగా ఆమె సేవలు చేస్తున్నాకూడా, నీయందు ప్రేమచేత నా సమయమంతా నీతోనే గడిపేవాడిని. అయినా ఆమె ఎన్నడూ నీ గురించి పల్లెత్తుమాట అని ఎరుగదు. రాముడు ఆమె కడుపున పుట్టడం, పెద్దవాడు కావదం దైవనిర్ణయమేగాని ఎవరూ ప్రయత్నించి చేసింది కాదు. రాముని అడవులకు పంపమని అంటున్నావు. అటువంటి కౌసల్యకు నేను ఏమని సమాధానం చెప్పను? రోగంతో లంఖణాలు చేస్తున్న రోగికి ఊరగాయలతో కూడిన అన్నం తింటే రోగం తిరగబెట్టినట్లుగా నేను నీ పట్ల చూపిన ప్రేమాభిమానాలన్నీ వికటించి నన్ను పీడిస్తున్నాయి. రాముణ్ణి అరణ్యాలకు పంపితే లక్ష్మణుడు ఏమైపోతాడోనని సుమిత్ర భయపడిపోతుంది. రాముడు అడవులకు పోవలసివస్తే నేను మరణించడం ఖాయం. నా మరణవార్త, రాముని వనవాసం తప్పక సీతను క్రుంగదీస్తాయి. ఇన్ని అనర్థాలకూ కారణమైన నువ్వు, భరతుడు కలసి రాజ్యాన్ని పరిపాలించుకోండి!

విషాన్ని మద్యమనుకొని త్రాగినట్లుగా ఇంతకాలం నేను కూడా నీ అందచందాలు, నీ నటన చూసి మోసపోయాను. నీ నిజస్వరూపం ఈ రోజే చూస్తున్నాను.

పూర్వం నన్ను బుజ్జగిస్తూ తియ్యటి కబుర్లు చెబుతూ లాలించే దానవు. అవన్నీ వేటగాడు గీతాన్ని పాడి లేడిని పట్టినట్లుగా నన్ను చంపుతున్నాయి. నా ప్రియమైన రాముణ్ణి అమ్ముకొని స్త్రీ సుఖం కొనుక్కున్నవాణ్ణయ్యాను, సురాపానం చేసిన బ్రాహ్మణునిలా నన్ను అంతా చులకనగా చూస్తారు. నేను పూర్వజన్మలందు చేసుకొన్న పాపఫలితంగా, నీ స్వభావం తెలుసుకోలేక ఇంతకాలం పోషించాను. పిల్లవాడు తెలియక విషసర్పంతో అదుకున్నట్లయింది.నా చేతులతో నేనే ఉరిత్రాడును బిగించుకున్నట్లయింది. మహాత్ముడైన రామునికి నేను తండ్రిని అని చెప్పుకోవటం కూడా దోషమే! లోకులు నన్ను తప్పక ద్వేషిస్తారు. కామానికి లొంగిపోయి స్త్రీ సుఖం కోసం కన్న కొడుకును అమ్ముకున్నానని నన్ను తప్పక ద్వేషిస్తారు. రాముడు ఇంతకాలం గురుకులంలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ రాజభోగాలన్నింటికీ దూరంగా ఉన్నాడు. ఇక ఇప్పుడు భోగాలు అనుభవించే సమయం వచ్చేసరికి అడవులకు పంపుతున్నాను. "నాయనా! రామా! నువ్వు అరణ్యవాసం చెయ్యాలయ్యా!" అంటే "అలాగే తండ్రీ" అంటాడే కాని ఎదురు చెప్పడు. నా మాటను జవదాటదు. రాముడు అటు అడవులకు పోగానే, నేనుకూడా యమలోకానికి ప్రయాణమవుతాను. ఇంకా ఎన్నో అశుభాలు జరుగనున్నాయి. నా వియోగాన్ని సహించలేని కౌసల్యాదేవి నన్ను అనుసరిస్తుంది. సుమిత్రకు, లక్ష్మణ శత్రుఘ్నులకు మిగతా పరివారానికందరికీ నరకాన్ని చూపిస్తూ నీ వొక్కతెవే సుఖంగా ఉందు! ఈ పరిణామాలతో ఇక్ష్వాకువంశానికే కళంకం వస్తుంది. ఇక ఈ వంశం సర్వనాశనం కావడం తథ్యం. ఒకవేళ రాజ్యాభిషేకానికి భరతుడు కూడా ఇష్టపడితే నా మరణానంతరం అతనిచే నాకు ప్రేతకార్యాలు చేయించవద్దు.

ఓ దుష్టురాలా! నువ్వు నా వంశానికి శత్రువుగా నా ఇంట్లో ప్రవేశించావు. నీ కోరిక ప్రకారం రాముడు అడవులకు వెళ్ళగలదు. ఆ తరువాత నా మరణం కూడా సత్యమే. ఇక విధవవై నీ కొడుకుతో కలసి రాజ్యపాలన చేసుకో! ఇప్పుడు జీవించి ఉన్న ప్రాణులు, ఇకపై జీవించే ప్రాణులన్నీకూడా నన్ను ఒక మహాపాపిగా అనాదరంతో చూస్తారు. ఇంతవరకు రథాలపైన, గుర్రాలపైన, ఏనుగులపైన ఎక్కి ప్రయాణం చేసిన నా రాముడు అరణ్యంలో కాలినడకన పద్నాలుగు సంవత్సరాలు నడవబోతున్నాడని తలచుకొంటేనే నా గుండెలు పగిలిపోతున్నాయి. రాముడికి వివిధరకాలైన రుచులతో అన్నం పెట్టేందుకు వంటవాళ్ళంతా ఎగబడేవాళ్ళు. ఇకపై అరణ్యంలో దొరికే కందమూలాలు భుజిస్తూ కాలం గడపాలి. అవికూడా ఒక్కోసారి సమయానికి దొరుకుతాయి, కొన్ని సమయాల్లో దొరకవు. నా రాముడు ఆకలికి తట్టుకోగలదా? అమూల్యమైన పట్టువస్త్రాలు ధరించే నా రాముడు ఇకపై నారవస్త్రాలు ధరించి కటిక నేలపై పడుకోవలసి ఉంటుంది గదా! ఆడవారు స్వలాభంకోసం ఎంతటి అపకారాన్నైనా తలపెట్టగలరుగదా! ఈ మాట అందరి స్త్రీలకు వర్తించదు. భరతుని తల్లి మాత్రమే అట్టి స్వార్థపరురాలు.

స్వార్థపరురాలా! క్రూరురాలా! నాకు దుఃఖం కలిగించటమే లక్ష్యంగా పెట్టుకున్నావేగాని, నా వలనగాని, రాముని వలనగాని నీకు ఏ విధమైన అపకారం జరుగుతుందని అనుకొంటున్నావు? నిన్ను ఆదర్శంగా తీసుకొని కొందరు స్త్రీలు భర్తను, పిల్లలను విడిచి వేస్తారు. అన్యోన్యంగా ఉంటున్న భార్యలు భర్తలను, భర్తలు భార్యలను విడిచిపోతారు.

రాముడు చక్కగా అలంకరించుకొని దేవేంద్రునిలా వస్తూ ఉంటే, నాకు మళ్ళీ యౌవనం వచ్చినంత ఆనందం కలుగుతుంది. సూర్య చంద్రులు లేకుండా లోకవ్యవహారాలు నడుస్తాయేమోగాని, రాముడు లేకుండా ఎవరూ జీవించలేరు. 

నువ్వు వినాశనాన్ని కోరుకుంటున్నావు. నువ్వు శత్రువని తెలియక ఇన్నాళ్ళూ పాలుపోసి పోషించాను. ఆ పొరపాటుకు ఈనాడు శిక్ష అనుభవిస్తున్నాను. నన్నూ రామలక్ష్మణులనూ వెళ్లగొట్టి భరతుడు, నుమ్వా రాజ్యాన్ని పాలించండి. నా శత్రువులకు అనందం కలిగించండి.

ఓసీ! దుష్టురాలా! నువ్వు పలికిన మాటలకు నీ నోటి దంతాలన్నీ వేయి ముక్కలైపోతాయి. రాముడెప్పుడైనా ఎవరినైనా మాటలతో నొప్పించాడా? రాముడు సకల సద్గుణసంపన్నుడు. అతడిలో ఏమి దోషం చూపించి అడవులకు పొమ్మంటున్నావు? నువ్వు కోరే కోరికలు సర్వనాశనానికి దారితీస్తాయి.

ఓసీ పాపాత్మురాలా! నువ్వు ఏడ్చినాసరే! మంటల్లోపడి కాలిపోయినా సరే, వేయిముక్కలైనా సరే! నేను మాత్రం నువ్వు కోరిన వరాలివ్వను. నువ్వు మంగలి కత్తిలాంటి దానవు. అప్రియమైన మాటలే మాట్లాడుతున్నావు. నీ దుష్టస్వభావం, నీ అసత్యపు మాటలు నా కులాన్నే చిచ్చు పెట్టుతున్నాయి. నీ ఇచ్చకాలకు, కల్లబొల్లి మాటలకు నేను లొంగిపోను. నా మనస్సును ముక్కలు ముక్కలుగా నరుకుతున్నావు. నా హృదయాన్ని దహించి వేస్తున్నావు. నువ్వు జీవించి ఉండటం శ్రేయస్కరం కాదు.

ఓ కైకా! రాముడు లేనిదే నాకు జీవితమే లేదు. ఇక సుఖా లెక్కడివి? నువ్వు నా భార్యవు. నాకు దుఃఖం కలిగించే పనులు చేయవద్దు. నీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాను. నన్ను అనుగ్రహించు.

ఆ విధంగా అంటూ, లేచి దశరథుడు తూలుతూ ఆమె పాదాలు పట్టుకోబోయాడు. ఆయన తన పాదాలు తాకకుండా ఉండేందుకు కైక దూరంగా జరిగింది. నిలబడే శక్తికూడా లేని దశరథుడు కుప్పగా కూలి నేలమీద పడిపోయారు.



                                                                                                                                ← PREV || NEXT→

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు