ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

కైకేయి కోపగృహం చేరటం || Kaikeyi Kopagruham Cheratam || Ramayanam || Episode - 43

 కైకేయి కోపగృహం చేరటం

కైకేయి మంథరతో ఇలా అన్నది : ఓ మంథరా! నీ మాటలలోని గూఢార్థం ఇప్పుడిప్పుడే బోధపడుతోంది. రాముని రాజ్యాభిషేకాన్ని ఎట్లాగైనా ఆపాలని నా మనస్సు తహతహలాడుతోంది. నా మనస్సు మొద్దుబారిపోయింది. నాకు ఏమీ తోచటంలేదు. నువ్వే ఏదైనా మంచి ఆలోచన చెప్పు.

అప్పుడు మంథర అమ్మా! రాణీ! నీకు అన్నీ తెలుసు. నా నోటినుండి వినాలని ఈ విధంగా మాట్లాతున్నావు. అయినా అడిగావు కాబట్టి, నాకు తోచిన సలహా చెబుతాను, విను. పూర్వం దేవాసురులు యుద్ధం చేసే సమయంలో ఇంద్రుడు, ఇతర రాజర్షులతోపాటు నీ భర్త సహాయం కోరాడు. ఆ యుద్ధానికి దశరథ మహారాజు నిన్నుకూడా తీసుకొని వెళ్ళాడు. మీరంతా కలసి దండకారణ్య ప్రాంతంలో తిమిధ్వజుడనే రాక్షసుని బలగాలను ఎదుర్కొన్నారు. వారిలో శంబరుడనే వాడు బహు మాయావి. దేవతలందరినీ జయించి ఇంద్రునితో తలపడ్డాడు. ఆ మహాయుద్ధంలో గాయపడ్డ వారిని రాక్షసులు రాత్రిపూట నిర్దాక్షిణ్యంగా చంపడం మొదలుపెట్టారు. ఆ సమయంలో దశరథ మహారాజుకు కూడా యుద్ధంలో బాగా గాయాలయ్యాయి. ఒళ్ళు తెలియకుండా రథంలోనే పడి ఉన్న దశరథుని, నువ్వు రథసారథ్యం వహించి అతినేర్పుగా కాపాడావు. అయినా రాక్షసులు అక్కడకు కూడా వచ్చి దశరథుని చంపేందుకు ప్రయత్నించారు. అప్పుడు కూడా నువ్వు బహు చాకచక్యంగా నీ భర్తను రక్షించుకున్నావు. తరువాత నీ సాహసానికి, చాకచక్యానికి మెచ్చుకొని, “ఓ రమణీ! నువ్వు నాకు రెండుసార్లు ప్రాణదానం చేశావు. కనుక నేను నీకు రెండు వరాలు ఇవ్వదలచాను కోరుకో" అని అన్నాడు. అప్పుడు నువ్వు
పతిప్రాణాలు కాపాడటం నా ధర్మంకదా అని చెప్పినా ఆయన నిన్ను రెండు వరాలు కోరుకొమ్మని బలవంతపెట్టాడు. అంతట నువ్వు “నాకెప్పుడు కావాలో ఆ సమయంలో కోరుకొంటా” నని ఆయనతో అన్నావు.

అమ్మా! కైకేయీ! ఈ కథ అంతా నువ్వే నాకు అనేక సందర్భాలలో చెప్పావు. నీ శౌర్యపరాక్రమాలను రోజూ మననం చేసుకుంటూ ఈ కథను జ్ఞాపకం పెట్టుకున్నాను. ఇంకా నువ్వు ఆ వరాలను కోరుకోలేదు సుమా. దేవీ! ఇప్పుడు నువ్వు ఆ వరాలు కోరుకొనే సమయం వచ్చిందని అనుకొంటున్నాను.
భరతునికి యౌవరాజ్యాభిషేకం చేయమని ఒక వరం కోరుకో. రాముని పద్నాలుగేళ్ళపాటు వనవాసానికి పంపమని రెండో వరం కోరుకో. అంటే భరతుడు పద్నాలుగేళ్ళ పరిపాలనలో రాముడిని మరిపించి తన రాజరికాన్ని సుస్థిరం చేసుకుంటాడు. ఇక ఆ వరాలను అడిగే విధానం కూడా చెబుతాను విను. నగలన్నీ తీసివెయ్యి. చిరిగిపోయిన, మాసిపోయిన చీర ధరించు. కోపం నటించు. అలక గృహంలో పడుకో. మహారాజు వచ్చి నిన్ను పలకరించిన పలకవద్దు. ఆయన పలకరించిన కొద్దీ ఏడుస్తూ నేలపై పొర్లిగింతలు పెట్టు. అంతట మహారాజు నీ దైన్యస్థితి చూసి హడలిపోతాడు. ఏమీ పాలుపోక “రాణీ! నీ దుఃఖానికి కారణం ఏమిటో చెప్పు, ఇంద్రుడినైనా ఎదిరిస్తాను. ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాను. కానీ నీ దుః ఖాన్ని భరించలేనని పరిపరి విధాల వేడుకుంటాడు".అమ్మా, కైకేయీ! ఆయనకు నీపై గల అనురాగాన్ని వెలకట్టలేము. ఆ విషయంలో మిగతా రాణుల కంటే నువ్వు అదృష్టవంతురాలవు. నీకు మణులు, మాణిక్యాలు ఇస్తానంటాడు. నువ్వు దేనికీ లొంగరాదు. మరీ తెగేదాకా లాగకూడదు సుమా! సరైన సమయం చూసి ఈ రెండు
వరాలు అడిగెయ్యి. దశరథ మహారాజు ధర్మశీలుడు. అడినమాట తప్పనివాడు. మొదట కాస్త తటపటాయించినా, చివరకు నువ్వు కోరిన రెండు వరాలనూ ప్రసాదించగలడు. నా మాట నమ్ము.

కైకేయి స్వభావంచేత మంచిదే అయినా, దుష్టసాంగత్యం చేత క్షణకాలం బాలికలా మంథర పన్నాగానికి బానిస అయింది. 
ఓ మంథరా! నిన్ను ఇంతకాలం ఏదో ఒక దాసీని చూసినట్లుగానే చూశానే గాని, నువ్వు నా పట్ల ఇంత ప్రేమాభిమానాలు కలిగి ఉంటావని అనుకోలేదు. అంతేకాదు, నువ్వు ఇంత వివరంగా చెప్పకపోయినట్లయితే నా భర్త నా పట్ల చేస్తున్న దుర్గ్మార్గాన్ని
తెలుసుకోలేకపోయేదాన్ని. నా కళ్ళు తెరిపించావు. నువ్వు ప్రపంచంలో ఉండే గూని వాళ్ళందరిలోకి శ్రేష్ఠురాలవు సుమా! ఆ మాటకొస్తే, నీకూ మిగతా గూని వారికీ పోలికే లేదు అని కైకేయి మంథరతో అన్నది. 

వాళ్ళంతా వీపుపైన ఇంత గూనితో ఉంటూ వంకరటింకర అవయవాలతో అందవిహీనంగా ఉంటారు. నువ్వు అట్లా కాదు. గూని వారందరిలోకి అందగత్తెవు. వీపుపై నీ గూని ఎంత ఎత్తుగా బైటకు కనిపిస్తుందో అంతే ఎత్తున ముందు ప్రక్కగూడా నీ ఎత్తైన వక్షస్థలం బిగువుగాను, బింకంగాను ఉండే నీ స్తనాల అందాలను ఏమని వర్ణించి చెప్పను? ఆ అందాలు తమకు లేకపోయాయే అనే దిగులుతో నీ బొడ్డు, పొట్ట సిగ్గుతో చిక్కిపోయాయి. నీ ముఖం చంద్రబింబంలా వెలిగిపోతోంది. నువ్వు గూని చేత వంగి నడుస్తున్నా నీ ముఖం మాత్రం
అందవికారంగా లేదు. వంగిన తామరపూవులా ఉంది. తొడలు, పిక్కలు, అందమైన పాదాలతో నువ్వు నడచి వెళ్తూ ఉంటే రాజహంసలా ఉంటావు సుమా! నువ్వు తెల్లని చీరకట్టుకొని మొలలో గజ్జలు కట్టుకొని నడుస్తూంటే కోయిలలు సన్నగా గానం చేస్తున్నట్లుంటుంది.

ఓ మంథరా! యుద్ధంలో శంబరాసురుడి మాయలు చూశాను. కానీ వాడి మాయలకన్నా ఎన్నో వేలరెట్లు నీలో మాయలు ఉన్నాయి. ఎన్నో రాజనీతులు ఉన్నాయి. రాముడు అడవులకు పోయి, భరతుని పట్టాభిషేకం కాగానే నీ గూనుకు బంగారు తొడుగు చేయిస్తాను. బంగారు
మాలలు చేయిస్తాను. నీ ముఖాన బంగారు తిలకం దిద్దిస్తాను. ఇంకా ఎన్నో అందమైన అలంకారాలు చేయిస్తాను. నీ వైభవం చూసి నా సవతులంతా అసూయపడేట్లు చేస్తాను. నా దాసీలంతా నీకు పాదసేవ చేసేట్లుగా చేస్తాను. ఇంకా ఎన్ని చేసినా నీ ఋణం తీర్చుకోలేను సుమా!

కైకేయీ! నువ్వు ఈ మాటలతో కాలం వృథాచేస్తున్నావు. ఈలోగా రామపట్టాభిషేకం జరిగిపోతుంది. అప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లవుతుంది మన బ్రతుకు. నదిలో నీరంతా పోయిన తర్వాత ఆనకట్టలు కడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా?
చెప్పు. కాబట్టి ఇట్లాంటి మాటలతో కాలయాపన చేయవద్దు. వెంటనే రంగంలోకి దిగు, రాజును పిలిపించు. నీ చాకచక్యం అంతా చూపించు. అనుకున్న పని సాధించు. ఆపైన ఈ మాటలన్నీ చెప్పు అని మంథర కైకేయితో అన్నది. 

మంథర అ విధంగా కైకేయిని పెడమార్గాన నడిపించింది. ఆమె కళ్లు, బుద్ధికూడా మూసుకుపోయేంత వరకు ఆమెను ప్రేరేపించింది. కైకేయి ఆ క్షణాన బుద్ధిహీనురాలయింది. తన అందమైన ముఖానికి వన్నె తెచ్చిపెట్టే ఎంతో విలువైన ఆభరాణాలన్నీ తీసి అవతల పారేసింది. మంథరతో కలసి కోప గృహంలోనికి ప్రవేశించింది. కటిక నేలపై పడుకుంది. 

ఓ కుబ్జా! మంథరా! నేను ఇప్పుడే ప్రతిజ్ఞ చేస్తున్నాను. రాముడు అడవులకు వెళ్లి భరతుని పట్టాభిషేకమైనా జరగాలి. లేదా నేను ఇక్కడే మరణించాలి. ఈ రెంటిలో ఏదో ఒకటి తప్పక జరిగి తీరాలి. పోయి రాజుకు నా మాటగా చెప్పు అని కైకేయి మంథరతో అన్నది. 

అప్పుడు మంథర ఓ రాణీ! రాముడు రాజైతే నువ్వు, నీ కొడుకు అనేక కష్టాలు పాలుకాక తప్పదు. అందువల్ల నూరు ఆరైనా నీ పట్టు విడువరాదు. నువ్వు అనుకొన్నది సాధించాలి. భరతునికి పట్టాభిషేకం జరిగి తీరాలి అని అన్నది. 

అప్పుడు కైకేయి ఓ మంథరా! నువ్వు పదేపదే చెబుతున్న మాటలు తలచుకొంటూ ఉంటే దుఃఖం పొర్లుకొనివస్తోంది. రాముడు అడవులకు పోయి తీరవలసిందే. అట్లా జరుగకపోతే, ఇకపైన ఈ చీకటి ఇంట్లోనుండి బైటకురాను. చందన లేపనాలేవీ ఒంటికి పులుముకోను. అన్నమే తినను. నీళ్ళు త్రాగను. ప్రాణత్యాగం చేస్తాను అని మంథరతో అన్నది. 

శాపగ్రస్తురాలైన దేవకన్యలాగా, కైకేయి ఆ చీకటిగదిలో కటిక నేలపై పడుకుంది. అంత చీకటి గృహంలో కోపంతో రగిలిపోయే ఆమె ముఖం మాత్రమే ఎర్రగా తెలుస్తోంది. ఆమె నేలపై విసిరికొట్టిన రత్నహారాలు, మణిమాణిక్యాలు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. 




                                                                                                                                  ←PREV || NEXT→

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు