ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu

Image
  ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ అలంకారవతి చంద్రవర్మను వెంటబెట్టుకొని రాజసభకు వెళ్ళింది. రాజుకు నమస్కరించి అక్కడ నిలబడింది. చంద్రవర్మ ఆ రాజును ఆశీర్వదించాడు. అందగాడైన చంద్రవర్మ గొప్ప తేజస్సుతో, మన్మథుడిలా ప్రకాశిస్తూ ఉండటం చూసి, ఆ పట్టణ ప్రభువైన మహేంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. రాజు వారిని కూర్చోమని చెప్పి, వేశ్య కూతురైన అలంకారవతిని చూసి ఇలా అడిగాడు: "ఓ అందగత్తె! నువ్వు ఎవరివి? ఈ నగరంలోనే ఉంటావా? నిన్ను నేనెప్పుడూ చూడలేదే! ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరు? ఇతడిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీరు వచ్చిన కారణం ఏంటో వివరించు." అందుకు అలంకారవతి రాజుతో ఇలా అంది: "మహాప్రభూ! నేను ఈ నగరంలోనే పేరుపొందిన ఒక వేశ్య కుమార్తెను. నా పేరు అలంకారవతి. నేను ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని, మా వేశ్య కుల మర్యాద అయిన వ్యభిచార వృత్తిని వదిలేశాను. బయటి ప్రపంచానికి కూడా తెలియకుండా ఇప్పటివరకు ఇంట్లోనే కాలం గడిపాను. అందుకే మీరు నన్ను చూసే అవకాశం రాలేదు." ఆ తర్వాత ఆమె తన వ్రతం వివరాలను, ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి రావడం, అతడిని చూసి తాను మోహించి, నిద్ర లేపడానికి పడిన తాపత్రయాన్ని, తన మనసులోన...

శ్రీరాముడు సీతసమేతుడై వ్రతం ఆచరించడం || Sreeramudu Seethasamethudai Vratam Aacharinchadam || Ramayanam || Episode - 40

 

శ్రీరాముడు సీతసమేతుడై వ్రతం ఆచరించడం


వసిష్ఠుడు తన మందిరము నుండి వెళ్లిపోయిన తరువాత రాముడు, సీతతో కలిసి మంగళ స్నానము చేసి, భక్తితో శ్రీ మహా విష్ణువును పూజించాడు. తరువాత అగ్నికార్యము నిర్వర్తించాడు. శ్రీ మహావిష్ణు మంత్రములు జపిస్తూ అగ్నిలో నేతిని హెూమం చేసాడు. అగ్నిలో వేయగా మిగిలిన హవిస్సును తాను భుజించాడు. తరువాత తన భార్య సీతతో కూడా దర్భలతో చేసిన చాప మీద పడుకున్నాడు.

మరునాడు తెల్లవారుజామునే నిద్రలేచాడు. తన మందిరమును చక్కగా అలంకరింపచేసాడు. ఇంతలో వంది మాగధులు వచ్చి స్తోత్రపాఠములతో వారి వంశచరిత్రను చక్కగా రామునికి వినిపించారు. రాముడు ప్రాత:కాల సంధ్యావందనము నిర్వర్తించాడు. గాయత్రీ మాతను ఉపాసించాడు. బ్రాహ్మణులు పుణ్యాహవాచనము చేసారు.

రామపట్టాభిషేకము జరుగబోవుచున్నదని అయోధ్యా నగర పౌరులందరూ తెల్లవారుజామునే మేల్కొన్నారు. పురమును అంతా అలంకరించారు. రాజ ప్రాసాదముల మీద, కార్యాలయముల మీద, దేవాలయముల మీద పతాకములను ఎగురవేసారు. గాయకులు పాటలు పాడుతున్నారు. నర్తకులు చక్కగా తయారయి రాజభవనమునకు వెళ్లుటకు సిద్ధమవుతున్నారు. నర్తకులు నర్తిస్తున్నారు. అందరూ మంగళకరమైన మాటలు మాట్లాడు కుంటున్నారు. ఎవరి నోట విన్నా రాముని గుణగణములు, రామ పట్టాభిషేకము గురించి మాటలు వినబడుతున్నాయి. రామ పట్టాభిషేకం గురించి తప్ప ఎవరూ మరొక మాట మాట్లాడుకోవడం లేదు. రామ పట్టాభిషేక మహోత్సవము ఎంతసేపు జరుగుతుందో, చీకటి పడుతుందేమో అని పట్ట పగలే చిత్ర విచిత్రములైన దీపములు వీధులలో వెలిగించి పెట్టారు.

తాను వృద్ధుడైన సంగతి ఎరింగి దశరథుడు తగిన నిర్ణయం తీసుకొన్నాడని, ఇంక నుంచి రాముని పాలనలో తాము సుఖ సంతోషాలు అనుభవిస్తామని అయోధ్యావాసులు పొంగిపోతున్నారు. రాముడు తామందరినీ తన సోదరుల మాదిరి వాత్సల్యముతో ఆదరిస్తాడని జనులంతా ఆనంద పరవశులౌతున్నారు. రాముని పట్టాభిషేక వార్త విన్న చుట్టుపక్కల జనపదములలో నివసించు జానపదులు తండోప తండములుగా అయోధ్యకు తరలి వస్తున్నారు. వారందరితోటీ అయోధ్యానగరము కిక్కిరిసి పోయింది. వారందరూ మాట్లాడుకుంటూ కేరింతలు కొడుతుంటే వారి ఘోష సముద్రఘోషను మరిపిస్తూ ఉంది. ఆ రోజు అయోధ్యానగరము మహేంద్రుని రాజధాని అమరావతిని తలపిస్తూ ఉంది.

వాల్మీకి రామాయణంలో ఈ విధంగా ఉంటే వ్యాసుడు రచించిన బ్రహ్మాండపురాణంలో భాగమయిన ఆధ్యాత్మ రామాయణంలో ఒక కొత్త విషయం ఉంది. అదేమిటంటే....

ఒక రోజు నారదుడు శ్రీరాముని వద్దకు వచ్చాడు. రాముని తో ఇలా అన్నాడు. "ఓ రామా! నన్ను బ్రహ్మ నీ వద్దకు పంపాడు. నీకు నీ తండ్రి దశరథుడు పట్టాభిషేకము చేయవలెనని నిశ్చయించాడు. కాని నీ జననము రావణ సంహారము కొరకు జరిగినది కదా! నీవు రాజ్యపాలన చేస్తుంటే, రావణ సంహారము మాటేమిటి? భూభారము తగ్గించుటకు నీకు రాక్షస సంహారము చేయవలయును కదా! రామా! నీవు దేని కొరకు అవతరించితివో ఆ విషయము మరిచిపోవద్దు" అని అన్నాడు. దానికి రాముడు ఇలా అన్నాడు. "నారదమహర్షీ! నాకు తెలియని విషయము ఏమున్నది. నేను ఆడిన మాట తప్పను. రాక్షస సంహారము చేసెదను. కాలము తీరిన దైత్యులను సంహరించెదను. రేపే దండకారణ్య ప్రయాణము. పదునాలుగు సంవత్సరములు అరణ్య వాసము చేసెదను. సీతాపహరణము మిషతో రావణుని సంహరించెదను.. ఇది సత్యము." అని రాముడు నారదునితో అన్నాడు. రాముని మాటలకు సంతోషించిన నారదుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు.

 (ఇక్కడ రాముడు సామాన్య మానవుడు కాదు. కారణ జన్ముడు. సాక్షాత్తు విష్ణు అవతారము, భూత, భవిష్యత్ వర్తమానములు తెలిసినవాడు అని చెప్పబడింది.)

తరువాత వసిష్ఠుడు రామునితో ఉపవాసవ్రతము చేయించిన తరువాత వెళ్లిపోయాడు. ఆ సమయంలో దేవలోకంలో దేవతలు సరస్వతీదేవి వద్దకు వెళ్లారు. "అమ్మా సరస్వతీ దేవీ! నీవు ఇప్పుడు వెంటనే భూలోకమునకు వెళ్లాలి. నీవు రామునికి జరుగబోవు పట్టాభిషేకమునకు విఘ్నము కలిగించాలి. ఇది బ్రహ్మదేవుని ఆదేశము. అమ్మా! నీవు ముందుగా మంధర అనే దాసి వాక్కులో ప్రవేశించాలి. తరువాత కైకేయి వాక్కులో ప్రవేశించాలి. శ్రీరాముని పట్టాభిషేక ప్రయత్నము భగ్నము అయిన తరువాత మరలా తిరిగిరావాలి.” అని ప్రార్థించారు. సరస్వతీ దేవి దేవతల ప్రార్థన మన్నించి అయోధ్యా నగరమునకు వచ్చి మంధర వాక్కులో ప్రవేశించింది.

(ఈ సంఘటనలు మనకు ఆధ్యాత్మ రామాయణంలో కనపడతాయి. ఇంక ఈ సందర్భంలో తులసీరామాయణం లో ఏముందో తెలుసుకుందాము.)

అయోధ్యలో పౌరులందరూ రామపట్టాభిషేక సందర్భములో ఉ త్సవాలు జరుపుకుంటుంటే దేవలోకములో దేవతలు విచారంగా ఉ న్నారు. వారందరూ సరస్వతీదేవి వద్దకు పోయి ఇలా అన్నారు.

"అమ్మా! రామ పట్టాభిషేకము జరుగబోవు చున్నది. నీవు ఎలాగైనా దానిని భగ్నము చేసి, రాముని అరణ్యములకు పంపాలి. దాని వలన దేవతల కార్యము సఫలమవుతుంది." అని అన్నారు. ఆ మాటలకు సరస్వతీ దేవి నేను ఇటువంటి పాడు పని చెయ్యాలా అని చింతించింది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. అప్పుడు దేవతలు ఇలా అన్నారు.

"అమ్మ తమరు ఈ పని చేసినందువలన తమరికి ఏ దోషమూ అంటదు. ఇది దేవ కార్యము. రాముడు సామాన్య మానవుడు కాడు. భేదమోదములకు అతీతుడు. సుఖము దు:ఖము సామాన్య మానవులకు కానీ రామునికి అంటవు. కాబట్టి తమరు అయోధ్యకు వెళ్లాలి.” అని ప్రార్థించారు.

అప్పుడు సరస్వతీ దేవి తనలో తాను ఇలా అనుకొన్నది.

"ఆహా! ఈ దేవతలు ఎంత అల్పబుద్ధులు. వీరు ఉండేచోటు అత్యున్నత స్థానమైన స్వర్గము. కానీ వీరి బుద్ధులు మాత్రము పరమ నీచములు. ఇతరులు బాగుపడుతుంటే చూచి సహించలేరు. పోనీ, ఇదీ ఒకందుకు మంచిదే... రాముడు వనవాసము వెళితే రాక్షససంహారము జరుగుతుంది. రామాయణ కధ లోకంలో ప్రచారం అవుతుంది. ఎంతో మంది కవులు గాయకులు రామ కథను గానం చేస్తారు. నేను ఆ కవులు గాయకుల నాలుకల మీద నాట్యం చేస్తుంటాను. రామ కథను గానం చేస్తుంటాను. దీనివలన భూలోకంలో నా పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి." అని అనుకొన్నది సరస్వతీ దేవి. దేవతల కోరిక ప్రకారము అయోధ్యకు వచ్చింది. ఇదీ తులసీరామాయణంలో ఉన్నకథ.

పై చెప్పిన కధా సంఘటనలు వాల్మీకి రామాయణంలో లేవు. రాముడు వనవాసమునకు పోవడంలో దేవరహస్యాలు ఏమీ లేవు. మామూలు మానవుల్లో ఎలాజరుగుతుందో అలా జరిగింది.

దశరథుడు భరతుడు ఇంటలేని సమయంలో కావాలనే రామ పట్టాభిషేకమునకు ముహూర్తము నిర్ణయించాడు అని స్పష్టంగా తెలుస్తూ ఉంది.

యుగధర్మము ప్రకారము రాజ్యము జ్యేష్టునికి చెందుతుంది. దశరథుని కుమారులలో పెద్దవాడు రాముడు. అందుకని రామునికి పట్టాభిషేకం చెయ్యడంలో ఎవరికీ అభ్యంతరం ఉండదు. కాని భరతుడు ఏమైనా పేచీ పెడతాడేమో అని దశరథుడు సందేహించాడు. అందుకని భరతుడు లేని వేళ పట్టాభిషేకము నిర్ణయించాడు.

వాల్మీకి రామాయణము ప్రకారము ఇందులో దేవతల ప్రసక్తి కానీ, దేవరహస్యము కానీ ఏమీలేవు.




                                                                                                                                      ←PREV || NEXT→

                                              

Comments

Popular posts from this blog

Dasarathudu Ayodhyaku Cheratam || దశరథుడు అయోధ్యకు చేరటం || Episode 34 || Ramayanam

Ramayanam || Shiva Dhanassu

Goppa Thyagam || గొప్ప త్యాగం || Moral Stories || నీతి కథలు