మంచివాడు – చెడ్డవాడు
ఒక ఊళ్లో ఇద్దరు ముసలివాళ్లు ఉండేవాళ్లు. ఒకడు మంచివాడు. ఒకడు చెడ్డవాడు. ఒక ఏడు సంవత్సరాది రోజున ఆ ఇద్దరూ కలుసుకున్నారు.
"నాకు రాత్రి చిత్రమైన కల వచ్చింది. నా అదృస్టం ఆకాశం నుంచి వచ్చి పడిందట." అన్నాడు మంచివాడు.
"చిత్రంగానే ఉన్నది. ఎందుకంటే, నాకూ నా అదృష్టం కలలో వచ్చింది. అది భూమిలో నుంచి వచ్చిందట." అన్నాడు చెడ్డవాడు.
"ఎవరి అదృష్టం ఎలా వస్తుందో చూద్దాం." అని మంచివాడు తన ఇంటికి వెళ్ళిపోయాడు.
కొన్నిరోజులు గడిచాక చలిరోజులు వెనకపడ్డాయి.
ఇవాళ పొలం పని ఆరంభించవచ్చు." అనుకుని మంచివాడు పారా, పలుగూ తీసుకుని పొలానికి వెళ్లి , తవ్వటం మొదలుపెట్టాడు. ఉన్నట్టుండి పలుగుకు ఏదో తగిలి ఖంగుమన్నది. పొలంలో పలుగురాళ్లు ఎలావచ్చాయా అని ఆశ్చర్యపడుతూ, తవ్వి తీసి చూస్తే అది ఒక బిందె ! మంచివాడు దాని మూత తీసి చూసేసరికి, అందులో బంగారు కాసులూ, మొహరీలూ, కనిపించాయి. మంచివాడు ఆ బిందెను తిరిగి యథాప్రకారం పెట్టేశాడు.
"పాపం, ఈ నిధి ఆ ముసలాడిది అయి ఉంటుంది. తన అదృష్టం భూమిలో దొరికినట్టు సంవత్సరాదినాడు అతను కల వచ్చిందన్నాడు. వెళ్ళి అతనితో చెబుతాను," అనుకుని మంచివాడు చెడ్డవాడి దగ్గరికి వెళ్లి , "పెద్దయ్యా, నీ అదృష్టం నా పొలంలో దొరికింది. బిందెనిండా బంగారు కాసులూ, మొహరీలూ ఉన్నాయి. నా పొలానికి వెళ్లి తెచ్చుకో." అని చెప్పి, ఇంటికి వెళ్లి పోయాడు.
అతను ఇంటికి వెళ్లి తన భార్యతో జరిగినదంతా చెబితే, పాపం పెద్దవాడు చాలా సంతోషించాడు. ఈ పాటికి అతను బిందెను ఇంటికి తెచ్చుకుని ఉంటాడు." అన్నాడు.
"న్యాయమైన పనిచేశావు," అన్నది మంచివాడి భార్య.
ఈలోపల చెడ్డవాడు మంచివాడి పొలానికి వెళ్లాడు . బిందె తవ్విన చోటు కనిపిస్తూనే ఉన్నది. పైమట్టి తొలగించగానే బిందె కనబడింది. వాడు ఆత్రంగా ఆ బిందెను పైకి తీసి, మూత తెరిచి, చూశాడు. అతనికి బిందెలోపల కాసులూ, మొహరీలు కనిపించటానికి బదులు పాములు మెలితిరుగుతూ కనిపించాయి. చెడ్డవాడికి చెప్పరాని కోపం వచ్చింది.
"దొంగవెధవ. ఎంత మోసం చేశాడూ! ఇందుకు వాడికి తగిన ప్రాయిశ్చిత్తం చెయ్యక మానను !" అనుకుని చెడ్డవాడు బిందెను ఇంటికి పట్టుకుపోయాడు.
ఆ రాత్రి చెడ్డవాడు ఆ బిందెతో సహా మంచివాడి ఇంటికి వచ్చి, నిచ్చెన వేసి ఇంటికప్పు ఎక్కి, దానిలో నుంచి లోపలికి చూశాడు. చలిమంటకు వీపు పెట్టి మంచివాడు పడుకుని ఉండటం చెడ్డవాడికి కనిపించింది. తనకు ఇంత ద్రోహం చేసి, నిశ్చింతగా చలి కాచుకుంటున్న మంచివాణ్ణి చూస్తే చెడ్డవాడికి మరింత కోపం వచ్చింది. అతను బిందె మీది మూత తీసి, దానిని పొగగూడులో నుంచి లోపలికి పెట్టి, కుమ్మరించాడు.
కాని చెడ్డవాడు అనుకున్నట్టు పాములు పడటానికి బదులు, బంగారు కాసులూ, మొహరీలూ మంచివాడి చుట్టూ పడ్డాయి. "అతను ఆనందంతో భార్యను లేపి, చూశావా, నా కల నిజమయింది. మన అదృష్టం ఆకాశం నుంచి పడింది," అన్నాడు.
అటు తరవాత మంచివాడు దారిద్య్రమన్నది ఎరగకుండా సుఖంగా జీవించాడు.
Comments