ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
ఇద్దరు శిష్యులు
పూర్వం గంగానదీ తీరంలో విజయానంద స్వామివారి ఆశ్రమం ఉండేది. ఆయన తన శిష్యులకు కేవలం జ్ఞానబోధ మాత్రమే చేసి వదిలేయకుండా సమాజాన్ని దగ్గర నుంచి పరిశీలించేలా తర్ఫీదు ఇచ్చేవారు. రవీంద్రుడు, జ్ఞానేంద్రుడు అనే ఇద్దరు శిష్యులను ఓ ఆరునెలలపాటు ఆయన దేశమంతా పర్యటించి రమ్మన్నారు. ఈక్రమంలో సమాజంలో ఎంతమంది మంచివాళ్లున్నారు.. ఎంతమంది చెడ్డవాళ్లున్నారో తెలుసుకోమని చెప్పారు. గురువు ఆశీర్వాదం తీసుకుని వాళ్లు బయలుదేరారు. పర్యటన తర్వాత శిష్యులిద్దరూ ఆశ్రమం చేరుకున్నారు. విజయానంద స్వామివారికి నమస్కరించిన తర్వాత... 'లోకంలో మంచితనం లేనే లేదు. నాకైతే ఒక్క మంచివాడు కూడా కనిపించలేదు' అని రవీంద్రుడు అన్నాడు. 'నువ్వేం గమనించావు.. జ్ఞానేంద్రా!' అని గురువు అడిగారు. 'నాకైతే చాలా మంది మంచివాళ్లు తారసపడ్డారు. నిజానికి ఒక్క చెడ్డవాడు కూడా కనిపించలేదు' అన్నాడు జ్ఞానేంద్రుడు. 'మీ ఇద్దరిలో ఎవరి అభిప్రాయం సరైనదో.. మీరే తేల్చుకొని చెప్పండి' అని స్వామీజీ అన్నారు. వాళ్లు కాసేపు చర్చించుకున్న తర్వాత, తాము చెప్పలేకపోతున్నామని గురూజీనే చెప్పమన్నారు. 'ప్రపంచమంతా పూర్తిగా చెడ్డవాళ్లతో నిండి ఉండదు. అలా అని మంచివాళ్లతోనూ నిండి ఉండదు. మనం ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితోనే కనిపిస్తుంది. అందరిలో చెడునే చూసిన రవీంద్రుడికి అందరూ చెడ్డవారిగా కనిపించారు. అందరిలో మంచినే చూసిన జ్ఞానేంద్రుడికి అందరూ మంచివారిగానే అగుపించారు. కానీ నిజానికి మంచీచెడుల కలయికే మానవ సమాజం. నాణేనికి బొమ్మాబొరుసూ ఉన్నట్లే.. ప్రతి ఒక్కరిలోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి. కొందరిలో మంచి ఎక్కువగా ఉంటే, మరి కొందరిలో చెడు ఎక్కువగా ఉండొచ్చు. మనం మంచీచెడులను గుర్తించగలగాలి. మంచివారు ఎప్పటికీ మంచివారిగానే, చెడ్డవారు ఎప్పటికీ చెడ్డవారిగానే ఉండిపోతారనీ అనుకోకూడదు. వారిలో ఎప్పుడైనా పరివర్తనా రావొచ్చు అన్న విషయాన్నీ గ్రహించాలి' అని వివరించారు గురూజీ.
Comments