ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
శ్రీరాముడు వైష్ణవ ధనుస్సును సంధించటం
రాముడు పరశురాముడితో ఇలా అన్నాడు: పరశురామా! నీవు నా తండ్రితో పలికిన మాటలన్నింటిని విన్నాను. నువ్వు స్వధర్మాన్ని పాటిస్తూ పితృబుణాన్ని తీర్చుకోవడం ఎంతైనా మెచ్చుకోదగ్గ విషయమే! అయినా, నన్ను పరాక్రమం లేని వాడిగా చులకన చేయడం, అవమానించడం నేను సహించను. ఇదుగో నా తేజస్సును, పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నాను చూడు.
ఇదుగో నువ్వు చూపిన ఈ విష్ణు ధనుస్సును చేత పట్టి నారి సంధించి బాణం ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాను.
ఓ పరశురామా! నీవు బ్రాహ్మణుడవయిపోయావు. అందునా, మీరు నా గురువులైన విశ్వామిత్రునికి బంధువవడం చేత నేను సంధించిన బాణాన్ని నీపై ప్రయోగించి నీ ప్రాణం తీయను. పరశురాముడు తండ్రి అయిన జమదగ్ని మహర్షి విశ్వామిత్రుని సోదరి అయిన సత్యవతి కుమారుడు.
ఓ పరశురామా! ఎక్కుపెట్టిన విష్ణు బాణం వ్యర్థం కారాదు. చెప్పు! నీ గమన శక్తిని కొట్టమంటావా? లేక నీవు ఇంతవరకు పుణ్యకర్మలచే సంపాదించుకొన్న సాటిలేని ఉత్తమ లోకాలను కొట్టమంటావా? నిర్ణయం నీకే వదలుతున్నాను.
రాముడు శ్రేష్టమైన ఆ ధనుస్సును ఎక్కుపెట్టగానే పరశురాముని తేజస్సు అంతా నిర్వీర్యమయింది. లోకమంతా స్తంభించిపోయింది.
అప్పుడు పరశురాముడు శ్రీరాముడితో ఇలా అన్నాడు : ఓ రామా! పూర్వం నేను భూమినంతా కాశ్యపునికి ఇచ్చినప్పుడు, నన్ను ఈ దేశం విడిచి వెళ్ళిపొమ్మన్నాడు. అప్పటి నుండి నేను మహేంద్ర పర్వతంపై నివసిస్తున్నాను. రాత్రి సమయమందు భూమిపై ఉండకూడదు. చీకటి పడబోతోంది. నేను వెంటనే భూమిని వదలి మహేంద్ర పర్వతానికి చేరుకోవాలి. కనుక నా వేగాన్ని (పాదగతిని) కొట్టవద్దు.
మనోవేగం చేత క్షణాల్లో మహేంద్ర పర్వతాన్ని చేరుకుంటాను.
కాబట్టి ఓ రామా! నేను తపస్సు చేత సంపాదించిన ఉత్తమలోకాలను నీ బాణంతో కొట్టు,ఆలస్యం చెయ్యకు. ఎప్పుడైతే నీవా ధనుస్సును, ఎక్కుపెట్టి బాణాన్ని సంధించావో అప్పుడే నీవు సాక్షాత్తూ విష్ణువేనని గ్రహించాను. నీకు మంగళమగుగాక! ఓ రామా! నీవు చేసే పనులకు
ఎవరూ సాటిరారు. నీ పరాక్రమాన్ని ఆకాశం నుండి దేవతలంతా చూస్తున్నారు.
ఓ రామా! ముల్లోకాలకు ప్రభువైన నీ చేతిలో ఓడిపోవడం వల్ల నేను సిగ్గుపడటం లేదు. నీవు వెంటనే బాణాన్ని ప్రయోగింపు. నీవు బాణం విడిచిన పిదప నేను మహేంద్ర పర్వతానికి వెళతాను.
పరశురాముడు అన్నమాటలు విని రాముడు బాణాన్ని విడిచాడు.
తాను తపస్ప్సుచే సంపాదించుకొన్న పుణ్యలోకాలను రాముడు బాణంతో కొట్టగా, వెంటనే పరశురాముడు మహేంద్రగిరి పర్వతంపైకి వెళ్ళిపోయాడు.
వెంటనే నలుదిక్కులనూ క్రమ్ముకొన్న చీకటులు తొలగిపోయాయి. దేవతలు ఆకాశం నుండి హర్షధ్వానాలు చేస్తూ పుష్పవర్షం కురిపించారు.
Comments