ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
శ్రీ కృష్ణదేవరాయల కొలువులో చేరిక
కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠేచ ముక్తావళీ
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమణి
అని రాగయుక్తంగా పాడుతున్న ఆ గొంతు విని, విజయనగర సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయలు ఒక్కసారి ఉలికిపడ్డాడు. గజారూఢుడై సాగుతున్న ఆయన ఎందుకో తన ప్రయాణాన్ని నిలుపుదల చేసుకుని చెవులు రిక్కించి, ఏనుగు దిగి మెల్లగా అడుగులు వేసుకుని ఓ ఆలయంలో ప్రవేశించాడు. చూస్తే ఎన్నిసార్లయినా చూడాలనిపించే శ్రీకృష్ణుని విగ్రహం ముందు చేతులు జోడించి పై శ్లోకం కర్ణపేయంగా ఆలపిస్తున్న ఓభక్తుని చూసి అతన్ని సమీపించాడు.
రాయలను చూసిన ఆలయపూజారులు సర్దుకుని, ఆభక్తున్ని గర్భగుడిలోంచి పక్కకు నెట్టారు. అప్పుడు కళ్లువిప్పి చూసాడాభక్తుడు. "అయ్యా! లీనమై ఆ దేవదేవున్ని తనివి తీరా కొలుచుకుంటున్న నన్ను నెట్టడానికి కారణం? నేనేమైనా తెలియని అపరాధం చేసి ఉన్నానా?”అని అడిగాడు.
"స్వామీ! ఆ వచ్చినది విజయనగర పురాధీశులు. ఇపుడే వచ్చి వెళ్ళారు. మరళ విచ్చేయడానికి కారణం తెలియదు. అందుకే భయపడుతున్నాం” బదులిచ్చి రాయలువారి ముందుకు పరుగున వెళ్ళారు పూజారులు.
"అర్చకులారా! ఎవరీ మహానుభావుడు ? ఎంత మధురంగా కృష్ణకర్ణామృతంలోని శ్లోకం ఆలపించారు. అది విని మరళ వచ్చాను.” అని ఆ భక్తుని వైపు తిరిగి "వాగ్గేయకారుడు లీలాశుకుడు రాసిన కృష్ణకర్ణామృతంలో రసాలూరించే శ్లోకం చిన్న చిన్న మార్పులు చేసి నాకు వినిపించి నా జన్మ ధన్యం చేసారు స్వామీ! ఎవరు మీరు? మీ దివ్య తేజస్సు చూస్తే సామాన్యులు కారని తెలుస్తోంది.” అని మృదుమధురంగా చిరునవ్వు చిందిస్తూ అడిగాడు శ్రీకృష్ణదేవరాయలు.
అర్చకులు బిక్కముఖాలు వేసి నిలబడ్డారు. వారికీ అతడెవరో తెలియదు. అడుగుతున్నది సాక్షాత్తురాయలవారు, గాభరపడ్డారు అర్చకులు.
ఆ భక్తుడు మిక్కిలి వినమ్రుడై రాయలవారికి చేతులు జోడించి “నా పాండురంగడు కోరకుండానే వరమిచ్చాడు. విద్యలనగరప్రభువు, మూరు రాయరగండడు, యవనరాజ్యస్థాపనాచార్యుడు, సాహితీసమ రాంగన చక్రవర్తి ముందు నన్ను నిలిపాడు. నేను ఎంతటి అదృష్ట వంతుడినో కదా! మీ దర్శన భాగ్యంచే మీ భువనవిజయమందు నాజీవితం పండినట్టుగా ఒక్కింత ఆనందం అనుభవించాను. ఈ జన్మకిది చాలు ప్రభూ !”
"మీరు కవులా? ఎంత చమత్కారంగా మీ మనస్సును చెప్పకనే చెప్పారు. మీరు కాదు ధన్యులు. నేను, నా విద్యలనగరం. క్షణము ఆలోచించక నాతో విచ్చేయండి. ఇప్పుడే స్వాగతిస్తున్నాను. మీ గురించి ఇంకా వినాలని కుతూహలపడ్తున్నాను. మీరెక్కడివారు? ఎక్కడ నుండి ఇక్కడికి వచ్చారు?
సవిస్తరంగా తెలియజేయండి. తక్షణం వినాలని ఆత్రపడ్తున్నాను." అని రాయలు అతని వంక అప్యాయంగా చూసి చిరునవ్వులు చిందించాడు.
Comments