ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
భోజరాజు
పూర్వము వైభవముగా అష్టైశ్వర్యాలు కలిగి ఉన్న ధారాపురం అనే నగరం ఉన్నది. ఆ నగరానికి భోజ మహీపాలుడు అధిపతి. అతను ధారానగరాన్ని తన దేశానికి రాజధానిగా చేసుకుని పాలిస్తున్నాడు. భోజరాజు తన దేశంలో ధర్మం తప్పకుండా ప్రజలను తన పిల్లలుగా చూస్తూ పరిపాలిస్తున్నాడు. ఆ కాలములో న్యాయములోను, ధైర్యములోను, శౌర్యములోను, గాంభీర్య, దయ, దాన పరాక్రమాది గుణాలలో అతడిని మించిన మరొక రాజు లేడు. అతను చాల సంతోషముగా ఏ బాధ లేకుండా "భూలోక దేవేంద్రుడు" అనే పేరును సంపాదించాడు.
ఒకరోజు భోజరాజు తన ప్రధానమంత్రిని పిలిచి ఇలా అన్నాడు:
మంత్రిగారు మన రాజ్యములో ఉన్న అడవిలో దుష్ట మృగముల వలన ప్రజలకి, పశువులకు, పంటలకు అధిక నష్టం కలుగుతుందని ప్రజలు వచ్చి చెప్పుకుంటున్నారు. ప్రజలు సుఖముగా ఉన్నప్పుడే కదా మనం సంతోషముగా ఉండేది. వారిని క్షేమముగా ఉంచడమే మన ముఖ్య కర్తవ్యం, ఆలస్యం చేయకుండా తగిన ప్రయత్నం చేసి ప్రజలకు, పంటలకు మృగముల వలన కలుగుచున్న ఆపదలని తొలిగించాలని నిశ్చయించాను.
కాబట్టి వేటకి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాటులను వెంటనే చేయించి నాకు తెలియచేయండి అని మంత్రిని ఆజ్ఞాపించాడు. అలాగే అని మంత్రి అక్కడ నుండి వెళ్లి వేటకు కావలసిన పరికరాలు, నిపుణులైన వేటగాళ్లను, సేవకులను అన్నీ ఏర్పాటుచేసి రాజుతో చెప్పాడు.
అంతట భోజరాజు వేటకు తగిన వస్త్రాలు ధరించి ప్రయాణానికి సిద్దపడి పల్లకి ఎక్కి బయలుదేరారు.
అలా భోజరాజు అడవిలోకి ప్రవేశించిన వెంటనే సేవకులను డప్పులు, చప్పట్లు అలాగే మరికొన్ని వాయిద్య పరికరాలు మ్రోగించమని భోజరాజు ఆజ్ఞాపించారు. ఆ ధ్వనులను విని భయపడి మృగాలు బెదిరిపోయి అటు ఇటు పరిగెడుతున్నాయి. దానితో ఏనుగులు, పులులు, సింహాలు, పందులు, లేళ్లు, ఎలుగుబంట్లు జంతు సమూహాలను తెలివితో సంహరించాడు.
మొనగాళ్ళైన విలుకాండ్రు సహాయముతో దుష్ట మృగాలను సంహరించారు. సంతోషముతో ప్రజలు తెచ్చి ఇచ్చిన కానుకలు తీసుకుని మరల తమ రాజ్యానికి తిరిగి బయలుదేరారు.
Comments